ర్యాపిడ్ టెస్టు కిట్లతో వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలు చేస్తున్న వైరస్ టెస్టులు వ్యాలిడ్ కాదని.. ఐసీఎంఆర్ స్పష్టమైన సూచనలు రాష్ట్రాలకు పంపింది. ఇటీవలి కాలంలో ఆంధ్రతో సహా పలు రాష్ట్రాలు ఈ ర్యాపిడ్ టెస్టు కిట్లను లక్షల సంఖ్యలో దిగుమతి చేసుకుని పది నిమిషాల్లో ఫలితాలను తేల్చేస్తున్నామని ప్రకటనలు ఇస్తున్నాయి. అయితే… వాటి ఖచ్చితంపై అనుమానాలున్నాయ. దీంతో ఐసీఎఆర్.. ఓ స్పష్టమైన సూచనను.. రాష్ట్రాలకు పంపింది. కరోనా ఉందో లేదో నిర్ధారించడానికి ఆర్టీ-పీసీఆర్ పరీక్షలు మాత్రమే ప్రామాణికమని స్పష్టం చేసింది. అనుమానితుల నుంచి సేకరించే స్వాబ్‌ను ” ఆర్టీ – పీసీఆర్ ” విధానంలో విశ్లేషించి… వైరస్ ఉందో లేదో గుర్తించడం ఒక్కటే మార్గమని స్పష్టం చేసింది.
యాంటీ బాడీ కిట్లతో చేస్తున్న టెస్టుల వల్ల… శరీరంలో రోగ నిరోధక శక్తి ఎంత మేర తయారయిందో తెలుస్తుంది తప్ప.. వైరస్ పాజిటివో.. నెగెటివో చెప్పలేమని ఐసీఎంఆర్ తేల్చేసింది. అందుకే… యాంటీబాడి టెస్ట్ కిట్ల వినియోగంలోనూ ఓ ప్రోటోకాల్ జారీ చేసింది. దీని ప్రకారం… ఆర్టీ-పీసీఆర్ టెస్టుల తర్వాతే… కరోనా పాజిటివా..? నెగెటివా..? అనేది నిర్ధారించాల్సి ఉంటుంది. ప్రస్తుతం దేశంలో వివిధ రాష్ట్రాలు యాంటీ బాడి టెస్టు కిట్లలో అత్యధిక శాతం నెగెటివ్ వస్తూండటంతో… తమకు వైరస్ ముప్పు తక్కువ ఉందని భావిస్తున్నారు. అయితే..రాజస్థాన్ వంటి రాష్ట్రాలు వాటిలో తేడాలు ఉన్నాయని గుర్తించి… వాడకం నిలిపివేశాయి. దీంతో ఐసీఎంఆర్ క్లారిటీ ఇచ్చింది.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో ర్యాపిడ్ టెస్టు కిట్ల ద్వారా పరీక్షలు చేసి… తాము చాలా వేగంగా పరీక్షలు చేస్తున్నామని చెబుతున్నారు. ఇప్పటికి నలభై వేలకుపైగా టెస్టుల చేసినట్లుగా ప్రభుత్వం ప్రకటించింది. కానీ.. ఏపీలో ఆర్టీ-పీసీఆర్ తరహా టెస్టులు చేయగల సామర్థ్యం ఏడు ల్యాబులకు మాత్రమే ఉంది. వీటి కెపాసిటీ 24 గంటలూ పని చేస్తే… 990 టెస్టులు మాత్రమే. అయితే కొద్ది రోజులుగా ఏపీ సర్కార్.. రోజులు నాలుగైదు వేల టెస్టులు చేస్తున్నామని చెబుతోంది. అంటే.. కొరియా నుంచి తెప్పించిన ర్యాపిడ్ టెస్ట్ కిట్ల టెస్టుల్నే అందులో కలిపేస్తున్నారు. అవి కరెక్ట్ కాదని..ఐసీఎంఆర్ తేల్చేసింది.