కరోనా కారణంగా అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. దింతో కొన్ని ఛానళ్లు పలువురు ప్రముఖుల్నిఆన్ లైన్ లో ఇంటర్వ్యూ లు చేసి వినోదాన్ని పంచే కార్యక్రమం చేస్తున్నాయి. ఇందులో భాగంగా దర్శకుడు రాజమౌళి కూడా ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో చాలా విషయాలు పంచుకున్నారు . ఐతే ఆయన చెప్పిన ఓ అభిప్రాయం కొందరికి నచ్చలేదు.
‘పారాసైట్’.. 2020లో ఆస్కార్ అవార్డుల పోటీల్లో ఈ సినిమా ఉత్తమ విదేశీ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ సినిమా, ఉత్తమ స్క్రీన్‌ప్లే విభాగాల్లో విజేతగా నిలిచింది. ఈ సినిమా గురించి ప్రపంచం మొత్తం గొప్పగా మాట్లాడుకుంది. అయితే ఈ సినిమా రాజమౌళికి ఎందుకో నచ్చలేదు. అమెజాన్ ప్రైమ్‌లో ఈ చిత్రం అందుబాటులో ఉంది. లాక్ డౌన్ సమయంలో ఈ సినిమా చూసిన రాజమౌళి.. సినిమా నచ్చలేదని చెప్పారు. ‘పారాసైట్’ చాలా బోరింగ్‌గా అనిపించింది. సినిమా చూస్తూ మధ్యలోనే నిద్రపోయా” అని అన్నారు.
దీనితో కొందరు ఆయనపై విమర్శలకు దిగారు. ‘పారాసైట్’ గొప్పదనం.. గ్రాఫిక్స్ తో సినిమా నెట్టుకొచ్చే మీకు… నచ్చకపోవడంలో ఆశ్చర్యం లేదు. తాటి చెట్టుని వంచి బాణం వేయగల ప్రతిభ వున్న దర్శకులు మీరు. ‘పారాసైట్’మీకు ఎందుకు నచ్చుతుంది? అంటూ శ్లేశాలు వాడుతూ దాడికి దిగారు.
నిజానికి ఇది అనవసరమైన దాడి. ప్రతి ఒక్కరికి ఒక అభిప్రాయం వుంది. క్లాసిక్ సినిమాలు అందరికీ నచ్చాలని రూల్ లేదు కదా. రాజమౌళి తన అభిప్రాయం చెప్పారు. అంతమాత్రాన ఆయనపై ఇలా కామెంట్స్ చేయడం సమంజసం కాదనే చెప్పాలి.