కరోనా మనుషుల్ని మామూలుగా భయ పెట్టడం లేదు. వ్యవస్థలన్నీ బంద్ అయిపోయాయి. సినిమాల్లేవు. షికార్లు లేవు. షాపింగులు లేవు. ఆఖరికి హాయ్ అంటూ షేక్ హ్యాండులు కూడా లేవు. ఇలాంటి సమయంలో ఎవరు మాత్రం ఏం చేయగలరు? ‘మనం బతికున్నాం.. అది చాలు..’ అనే ధోరణికి వచ్చేస్తున్నారు జనాలు. డి.సురేష్ బాబు కూడా ఇదే మాట అంటున్నారు. `సినిమాల సంగతి తరవాత.. థియేటర్లు ఎప్పుడు తెరుస్తారన్నది ముఖ్యం కాదు. మనం బతికున్నాం.. అది చాలు` అంటూ వేదాంత ధోరణిలో మాట్లాడుతున్నారు.
థియేటర్లు ఇప్పట్లో తెరవడం కష్టం అన్నది సురేష్‌బాబు మాట. ఆయన ఎన్ని ఇంటర్వ్యూలు ఇచ్చినా – ఇదే ముక్క చెబుతున్నారు. ఇప్పుడూ అదే అంటున్నారు. కరోనా ఎఫెక్ట్ చిత్రసీమపై భారీగా పడిందని, ప్రస్తుతం అత్యంత దయనీయమైన పరిస్థితుల్లో చిత్రసీమ ఉందని అంటున్నారు సురేష్ బాబు. చిన్న సినిమా, పెద్ద సినిమా అనే తేడా లేదని, ప్రతీ నిర్మాత కరోనా బారీన పడి విలవిలలాడుతున్నాడని సురేష్ బాబు చెబుతున్నారు.
ఓటీటీ వాళ్లు సినిమాల్ని కొనడానికి సిద్ధంగా ఉన్నా పూర్తయి, విడుదలకు సిద్ధమైన సినిమాలు 10 కి మించి లేవని, ఇంకొన్ని సినిమాలు వారం, పది రోజుల షూటింగ్ బ్యాలెన్స్ లో ఉన్నాయని, షూటింగులు తిరిగి మొదలైతే తప్ప, ఆ సినిమాలు రెడీ అయ్యే పరిస్థితి లేదని, ఓటీటీలు కొనడానికి ముందుకొచ్చినా పది మంది నిర్మాతలే సేఫ్ అవుతారని అంటున్నారు. అయితే భవిష్యత్తు మాత్రం ఓటీటీ లదే అన్నది సురేష్ బాబు మాట. ”సినిమా అనేది వినోద సాధనం. మాధ్యమాలు మారుతాయంతే. ఇది వరకు థియేటర్లో సినిమా చూసేవారు. ఆ తరవాత శాటిలైట్ వచ్చింది. ఇప్పుడు ఓటీటీ వచ్చింది. ఓటీటీలోనే జనాలు సినిమాలు చూడ్డానికి అలవాటు పడితే, నిర్మాతలకు మరో మార్గం లేదు. అందుకు సిద్ధపడాల్సిందే” అంటున్నారు సురేష్ బాబు.
అయితే థియేటర్లకు మళ్లీ పునః వైభవం వస్తుందన్న ఆశాభావం సురేష్ బాబులో ఉంది. ”ముంబై దాడులు జరిగినప్పుడు థియేటర్లకు వెళ్లడానికి అందరూ భయపడ్డారు. నెల రోజుల పాటు థియేటర్లు తెరచుకోలేదు. ఆ తరవాత.. భయం తగ్గింది. థియేటర్లు పుంజుకున్నాయి. ఇలాంటి వైపరిత్యాలు వచ్చినప్పుడు సినిమా పరిశ్రమ నష్టపోతుంటుంది. అది సహజం. అయితే కరోనా భయాలు తగ్గిన తరవాత.. జనాలు మళ్లీ సినిమాలకు అలవాటు పడతారు. ఇది వరకటి కంటే ఎక్కువగా థియేటర్లకు వస్తారు. అయితే.. ఆ రోజులు ఎప్పుడొస్తాయన్నది చెప్పలేం. ఓ ఆశతో బతకడం ఒక్కటే చేయగలిగింది” అని ముక్తాయించారు సురేష్ బాబు.