ఆంధ్రప్రదేశ్లో లాక్డౌన్లు.. క్వారంటెన్లు ఏ మాత్రం వర్కవుట్ అవుతున్న సూచనలు కనిపించడం లేదు. ఇరవై నాలుగు గంటల్లో 80పాజిటివ్ కేసులు నమోదవడం…. దూసుకొస్తున్న కొత్త ప్రమాదానికి సంకేతంగా కనిపిస్తోంది. కర్నూల్లో అత్యధికంగా 31 కేసులు నమోదయ్యాయి. అక్కడ పాజిటివ్ కేసుల సంఖ్య 200 దాటిపోయింది. గుంటూరులో 18, చిత్తూరులో 14 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకూ కరోనాపై పోరాడి కోలుకుని 141 మంది డిశ్చార్జ్ కాగా.. 27 మంది మరణించారు. ప్రస్తుతం 725 మంది పలు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కర్నూలు, గుంటూరు జిల్లాల్లో పరిస్థితి ప్రమాదకరంగా మారుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. అక్కడ సామాజిక వ్యాప్తి తీవ్ర స్థాయిలో ఉందన్న అనుమానాలు ప్రారంభమయ్యాయి.
పాజిటివ్ కేసుల సంఖ్య అనూహ్యంగా పెరుగుతున్నప్పటికీ.. ఏపీ సర్కర్ భయపడాల్సిందేమీ లేదని చెబుతోంది. ఎందుకంటే.. తాము టెస్టుల సామర్థ్యాన్ని పెంచుకున్నామని.. పెద్ద ఎత్తున టెస్టులు చేస్తున్నందునే.. పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోందని… చెబుతున్నారు. గత ఇరవై నాలుగు గంటల్లో 6వేల 5వందలకుపైగా టెస్టులు చేశామని ప్రభుత్వం ప్రకటించింది. గతంలో భారీగా కేసులు బయటపడినప్పుడు ఇంత పెద్ద సంఖ్యలో… టెస్టులు చేయలేదనే విషయాన్ని గుర్తు చేస్తున్నారు. కర్నూలు, గుంటూరులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. వైరస్ మరింత వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
లాక్ డౌన్ ను మరింత కఠినంగా అమలు చేయాలని నిర్ణయం తీసుకున్న తెలంగాణలో పాజిటివ్ కేసుల నమోదు తగ్గిపోయింది. నిన్న పద్నాలుగు కేసులు మాత్రమే నమోదయ్యాయి. అయితే గ్రీన్ జోన్ల వారీగా… మినహాయింపులు ఇచ్చిన ఏపీలో మాత్రం… కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. రెడ్ జోన్లలో మాత్రం ఎవరికీ మినహాయింపులు ఇవ్వలేదు.