లాక్ డౌన్ వల్ల సినిమాల్లేవు. ప్రెస్ మీట్లు లేవు. ఇంటర్వ్యూల హంగామా లేదు. కొత్త కథలు వినడం అసలే లేదు. మరి స్టార్లకు టైమ్ పాస్ ఎలా? ఇలాంటి సమయంలోనే – బి ద రియల్ మాన్ ఛాలెంజ్ సెలబ్రెటీలకు మరీ ముఖ్యంగా హీరోలు, దర్శకులకు మంచి టైమ్ పాస్ ఇస్తోంది. ఇప్పటి వరకూ రాజమౌళి, సుకుమార్, కొరటాల శివ లాంటి దర్శకులు ఇప్పటికే ఇంటి పనులతో హోరెత్తించారు. హీరోలూ రంగంలోకి దిగారు. ఎన్టీఆర్, చరణ్, చిరు.. ఇలా ఈ ఛాలెంజ్ కొనసాగుతోంది.
హీరోలు.. ఇంటి పనులు చేయడం ముచ్చటగానే వుంది. అభిమానులకు ఇలాంటి విషయాలే ఆసక్తి కలిగిస్తాయి. కాకపోతే… మన ఇంటి పనులు మనం చేసుకోవడం కూడా ఓ ఛాలెంజేనా? అంటూ కొంతమంది నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి. దాని స్థానంలో ఏదైనా ఓ మంచి పని చేసి అభిమానులకు స్ఫూర్తి ఇవ్వాలన్న సూచనలు వస్తున్నాయి. కాకపోతే.. ఇలాంటి సమయంలో ఒక్క విషయం ఆలోచించుకోవాలి. ఇప్పటికీ చాలామందిలో సొంత ఇంటి పని చేసుకోవడం అంటే.. బట్టలు ఉతకడం, అంట్లు కడగడం, ఇల్లు శుభ్రం చేసుకోవడం నామోషీ గా అనిపిస్తుంటుంది. స్టార్లే చిపుర్లు పడితే – మనం ఎందుకు చేసుకోకూడదు అన్న అలోచన అభిమానులకు వస్తే నిజంగా ఇంటి పనుల్లో ఆడవాళ్లకు సాయం చేయగలిగితే ఓ మంచి వాతావరణాన్ని కల్పించడానికి మార్గం వేసినవాళ్లవుతారు. అంతేకాదు… కరోనా సమయాల్లో ఇంటి పట్టున ఉండడం కంటే, గొప్ప సంగతి ఏదీ లేదు. ఈ రకంగానూ అభిమానులకు స్ఫూర్తి ఇచ్చిన వాళ్లే అవుతారనుకోవాలి.