కరోనాకు మందు లేదు. నివారణే మార్గం. ఆ నివారణ ఎలా..? లాక్ డౌన్ వర్కవుట్ అవడం లేదు. సోషల్ డిస్టాన్సింగ్ పని చేయడం లేదు. మరి ఎలా.. వైరస్ ను ఎదుర్కోవాలి. దీనికి ఓ సాహసోపేతమైన విధానాన్ని ఎంచుకుని ముందుకెళ్తున్నాయి కొన్ని దేశాలు. వాటిలో ఒకటి స్వీడన్…మరొకటి ఇజ్రాయెల్. ఇప్పుడా దేశాల్లో లాక్ డౌన్ లేదు. స్వీడన్లో అందరూ స్వేచ్చగా తిరుగుతున్నారు. మరి అక్కడ ఎవరికీ వైరస్ అంటడం లేదా.. అంటే… అంటింది.. అందరికీ అంటింది. కానీ వారి దాన్ని తట్టుకోగలిగే శక్తిని ఇప్పటికే తెచ్చుకున్నారు. అలా తెచ్చుకోవడమే కొత్త విధానం.
వైరస్‌ను తట్టుకునేలా అందర్నీ తీర్చిదిద్దడమే హెర్డ్ ఇమ్యూనిటీ..!
హెర్డ్ ఇమ్యూనిటీ ఇప్పుడు… ప్రపంచంలో ప్రతీ దేశంలో చర్చనీయాంశం అవుతోంది. ప్రస్తుతం ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న వైరస్‌ను ఎదుర్కోవాలంటే.. వ్యాక్సిన్ కావాలి. వ్యాక్సిన్ కనిపెట్టడం కష్ట సాధ్యంగా మారింది. ఈ లోపు.. ప్రపంచం తీవ్రంగా నష్టపోతోంది. ఇలాంటి సమయంలో… హెర్డ్ ఇమ్యూనిటీ అస్త్రాన్ని ప్రయోగించాలని ప్రపంచంలో కొన్ని దేశాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. హెర్డ్ ఇమ్యూనిటీ అంటే… సామూహికంగా రోగ నిరోధక శక్తి పెంచడం. అందరికీ వైరస్ వ్యాప్తి అయ్యేలా చేయడం. పిచ్చిగా అనిపించినా.. ఇది ఓ గొప్ప ఆలోచన అని.. శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఉదాహరణకు.. వైరస్ సోకినప్పుడు మనిషి దాన్ని తట్టుకోగలిగితే… ఆటోమేటిక్‌గా అతనిలో దాన్ని తట్టుకునే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ప్రస్తుతం వైరస్ ఆరేళ్ల నుంచి 60 ఏళ్లలోపు వారికి సోకినా ప్రభావం తక్కువే ఉంటోంది. అరేళ్లలోపు.. అరవయ్యేళ్ల పైబడిన వారిని మాత్రం జాగ్రత్తగా ఉంచి మగిలిన వారందర్నీ.. అలా వదిలేయడం వల్ల హెర్డ్ ఇమ్యూనిటీ దశ వచ్చేస్తుందని పలు దేశాలు నమ్ముతున్నాయి.
60 శాతం లోరిస్క్ వారికి వైరస్ సోకితే హెర్డ్ ఇమ్యూనిటీ వచ్చేసినట్లే..!?
హెర్డ్ ఇమ్యూనిటీ రావాలంటే… జనాభాలో 60 శాతం మందికి వైరస్ వచ్చి ఉండాలి. హై రిస్క్ వర్గాలైన వృద్ధులు, పిల్లలకు వైరస్ సోకకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. అదే సమయంలో లో-రిస్క్ గ్రూపులైన యువకులకు వైరస్ సోకడంతో వారి రోగ నిరోధక శక్తి పెరిగి వ్యాధి వ్యాప్తి నెమ్మదిస్తుంది. మన జనాభాలో 60 శాతం కంటే ఎక్కువ మందికి ఇమ్యూనిటీ వచ్చిందనుకోండి. అప్పుడు ఆ జనాభా అంతటికీ ఇమ్యూనిటీ వచ్చిందని అనుకోవచ్చు. అంటే.. హెర్డ్ ఇమ్యూనిటీని సాధించినట్లే. ఇలా ఒక ప్రాంతంలోని సమూహానికి ఇమ్యూనిటీ వచ్చినప్పుడు.. మళ్లీ వైరస్ దాడి చేసినా నష్టం చాలా తక్కువగా ఉంటుంది. వైరస్ సోకిన అందరికీ బయటపడటం లేదు. అంటే వ్యాధికి గురైన ప్రజల్లో చాలా మందిలో రోగ నిరోధకశక్తి వైరస్‌పై పోరాడుతుంది. చాలా మంది శరీరాల్లో యాంటీ బాడీస్ ఏర్పడుతాయి. నెమ్మదిగా మొత్తం సమూహంలో వైరస్‌ను తట్టుకునే సామూహిక వ్యాధి నిరోధకత తయారవుతుంది. శరీరంలో యాంటీబాడీస్ ఏర్పడి వైరస్‌తో పోరాడుతాయి.
భారత్ వంటి దేశాల్లో మిస్ ఫైర్ అవడానికే ఎక్కువ అవకాశం ..!
ప్రతి వైరస్ పోరాడ్డానికి ప్రత్యేకంగా ఏర్పడే ఈ యాంటీబాడీస్ ఒక విధమైన ప్రొటీన్లు. వ్యాధి సోకినప్పుడు మనిషి శరీరంలో ఇవి తయారవుతాయి. వ్యాధినిరోధకశక్తి వీటిని తయారు చేస్తుంది. జనాభాలో 50 శాతం ప్రజలు వ్యాధికి గురైనా కానీ, ఈ యాంటీబాడీస్ దేహంలో ఉన్న వ్యక్తి శరీరంలోకి వైరస్ ప్రవేశించడం సాధ్యం కాదు. ఈ యాంటీబాడీస్ వైరస్ రాకుండా అడ్డుకట్టలా మారిపోతాయి. మిగిలిన యాభై శాతం జనాభాకు వ్యాధి సోకే ప్రమాదం ఉండదు. వ్యాక్సిన్ తయారయ్యే వరకు వ్యాధితో పోరాడ్డానికి ఇది ఉపయోగపడుతుంది. హెర్డ్ ఇమ్యూనిటీ వల్ల వైరస్‌పై యుద్ధంలో మధ్య వయస్కులను, ముసలివారిని లాక్డౌన్లో కాపాడుతూ, యువతను ముందుకు వెళ్ళి కరోనాను ఎదిరించేలా అవకాశాలు కల్పించవచ్చనేది చాలా మంది అభిప్రాయం. అయితే.. ఏదైనా అత్యుత్సాహంతో అవగాహనా లోపంతో.. చేసే పాలకులు ఉన్న భారత్‌లో ఇది విపరీత పరిణామాలకు దారి తీసే ప్రమాదం ఉంది.