విశాఖలో అది రూ. వంద కోట్ల విలువైన స్థలం. దానిపై వివాదాల్లేవు. దశాబ్దాల కిందట మిగులు భూమి కింద ప్రభుత్వానికి వెళ్లినా… ఆ తర్వాత డబ్బులు కట్టి క్రమబద్దకరించుకునేందుకు అప్పటి ప్రభుత్వాలు అవకాశం కల్పించాయి. ఆ మేరకు.. ప్రక్రియ కూడా పూర్తయిపోయింది. ప్రైవేటు స్థలంగానే ఉంది. ఇప్పుడు… హఠాత్తుగా ఆ స్థలాన్ని స్వాధీనం చేసుకుంటున్నామని ఏపీ సర్కార్ నుంచి జీవో విడుదలయింది. ఆ స్థలం కేంద్రంగా వైసీపీ అధికారంలోకి వచ్చాక.. చాలా జరిగాయి. మీడియాలో హైలెటయ్యాయి కూడా.
లాక్ డౌన్ సమయంలో… ఆస్తుల్ని స్వాధీనం చేసుకుంటామని.. భూముల్ని కైవసం చేసుకుంటామని జీవోలు ఇస్తారని ఎవరూ అనుకోలేదు. కానీ ఇచ్చారు.విశాఖపట్నంలోని మర్రిపాలెంలో జాతీయ రహదారిని ఆనుకొని సర్వే నంబరు 81/3లో 17,135 చదరపు మీటర్ల స్థలం లలితేష్ అనే వ్యక్తి పేరు మీద ఉంది. జ్యోస్యుల నారాయణదాస్ అనే వ్యక్తి కుటుంబానికి వారసత్వంగా వచ్చిన ఆస్తిని లలితేష్ కొనుగోలు చేశారు. ఈ జోస్యుల నారాయణదాస్ కుటుంబానికి చెందిన కొంత భూమిని మూడు, నాలుగు దశాబ్దాల కిందట.. అర్బన్ ల్యాండ్ సీలింగ్ చట్టం కిందట అప్పటి ప్రభుత్వాలు స్వాధీనం చేసుకున్నాయి. తర్వాత మార్కెట్ రేటు కట్టి.. మళ్లీ తీసుకోవడానికి అనుమతి ఇచ్చాయి. ఈ అనుమతితో 2009లో డబ్బులు కట్టి.. 17,135 చదరపు మీటర్ల స్థలాన్ని వెనక్కి తీసుకున్నారు. ఆ తర్వాత లలితేశ్ అనే వ్యక్తికి అమ్మారు.
ఈ లలితేష్ అనే వ్యక్తి ఐటీ నిపుణుడు… ఆయన విశాఖలో ఉండరు. ఆరోగ్యసేతు యాప్ రూపొందించడంలో కీలకంగా వ్యవహరించిన బృందంలో లలితేష్ సభ్యుడు. ప్రధానమంత్రి ఐటీ సలహాదారుల్లో ఒకరు. అందుకే.. తన తరపున విశాఖలో స్థలాల వ్యవహారాలను చూసుకునేందుకు.. తన బావమరిది నరేష్కుమార్కు జీపీఏ ఇచ్చారు. ఇంత వరకూ బాగానే ఉన్నా… ప్రభుత్వం మారిన తర్వాత.. చిక్కులు వచ్చి పడ్డాయి. గతేడాది సెప్టెంబరులో నరేశ్ ఇంటికి పులివెందులకు చెందిన బాలనారాయణరెడ్డి, లింగాల రామలింగారెడ్డి కొంత మంది అనుచరులతో వెళ్లి.. నరేష్ కుమార్ను తమకు రూ.10 కోట్లు ఇవ్వాలని బెదిరించారు. ఆ స్థలం వివాదంలో ఉందని.. రూ. పది కోట్లు ఇవ్వకపోతే ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని హెచ్చరించి వెళ్లారు. నరేష్ అప్పట్లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీ ఫుటేజీ మీడియాకు విడుదల చేశారు. కానీ చర్యలు తీసుకోలేదు.
ఈ వ్యవహారం మీడియాలో హైలెట్ అయింది. అసలు అంతా పక్కాగా ఉన్న భూమిపై సెటిల్మెంట్ ఏమిటన్నదానిపై చాలా మంది ఆశ్చర్యపోయారు. అయితే.. గతంలో అది ప్రభుత్వం ఇచ్చిన అనుమతి కారణంగా కొనుగోలు చేశారని.. ఇప్పుడు దాని విలువ బాగా పెరిగింది కాబట్టి…. కొంత వసూలు చేయాలన్న ఉద్దేశంతోనే ముఠాలు రంగంలోకి దిగాయని చెబుతున్నారు. ఈ మొత్తం వ్యవహారం వెనుక విశాఖలోనే తిష్టవేసి… రాజకీయాలు చక్క బెడుతున్న వ్యక్తి పాత్ర ఉందని చెబుతున్నారు. మొత్తానికి ప్రైవేటు వ్యక్తుల సెటిల్మెంట్ దందాలు.. చంపుతామనే బెదిరింపుల వరకూ ఉండేవి. ఇప్పుడు..నేరుగా జీవోలు వస్తూండటంతో.. కొత్త రకం వ్యవస్థీకృత సెటిల్మెంట్ వ్యవస్థ వచ్చేసిందనే భయం విశాఖ వాసుల్లో ప్రారంభమయింది.