ఆ మధ్యన ప్రభుత్వ భవనాల కు పార్టీ రంగులు వేసి అధికార వైఎస్ఆర్సిపి ప్రభుత్వం హై కోర్టు చేత మొట్టి కాయలు తిన్న విషయం తెలిసిందే. స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు ప్రభుత్వ భవనాలకు పార్టీ రంగులు వేసింది. అలా వేయడం చట్ట రీత్యా అమోగ్యం కాకపోవడంతో విపక్షాలు కోర్టును ఆశ్రయించాయి. దీంతో మూడు వారాల లోపు ప్రభుత్వ భవనాల పై వైసీపీ రంగు లు తొలగించాలని హైకోర్టు స్పష్టం చేసింది. కానీ, చట్టాల లోని లూప్ హోల్స్ వెతకడం లో నిష్ణాతులైన రాజకీయ నేతలు దాదాపుగా అవే రంగులు కొనసాగిస్తూ, అదే సమయంలో అవి పార్టీ రంగులు కాదంటూ కొత్త భాష్యం ఇస్తున్నారు. వివరాల్లోకి వెళితే..
పంచాయతీ భవనాలకు వైఎస్ఆర్ సీపీ అధికారంలోకి రాగానే నీలం తెలుపు ఆకుపచ్చ రంగులతో పెయింటింగ్ వేశారు. అయితే పార్టీ రంగు లు ప్రభుత్వ భవనాలకు వేయడం పై హైకోర్టు సీరియస్ అయింది. దీని మీద సుప్రీం కోర్టు కు వెళ్లిన జగన్ ప్రభుత్వాని కి అక్కడా చుక్కెదురైంది. కోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం రంగులు మార్చాల్సి వచ్చింది. అయితే వై ఎస్ ఆర్ సి పి ప్రభుత్వం ఆ రంగుల ను పూర్తిగా మార్చకుండా, ఇప్పటికీ వేసిన నీలం, తెలుగు ఆకుపచ్చ తో పాటు కొత్తగా ఎర్ర మట్టి రంగు వేయాలని నిర్ణయం తీసుకుంది. ఎర్ర మట్టి రంగు భూమి కి సంకేతమని, నీలం ఆక్వా విప్లవానికి, తెలుపు క్షీర విప్లవానికి, ఆకుపచ్చ హరిత విప్లవానికి సంకేతాలని భాష్యం చెప్పింది. ఆ రకంగా హైకోర్టు ఆదేశాలను పాటిస్తూనే తమ పంతాన్ని నిలబెట్టుకుంది. వివిధ శాఖలకు చెందిన భవనాలకు కూడా కావాల్సిన విధంగా రంగులు వేసుకోవచ్చు అంటూ జీవో కూడా ప్రభుత్వం జారీ చేసింది.
అయితే మాజీ మంత్రి దేవినేని ఉమా దేవుడి స్క్రిప్ట్ అంటే ఇదేనా జగన్ గారు అంటూ ట్వీట్ చేశారు. ఉమా ట్వీట్ చేస్తూ “కరోనా క్లిష్ట సమయం లో ముందుండి నడిపించే ఉద్యోగస్తుల కు సగం జీతాలే ఇస్తారు, డాక్టర్ల కి మాస్కులు కూడా అందించరు, కానీ వేల కోట్లు ప్రజా ధనం ఖర్చు పెట్టి ప్రభుత్వ భవనాలకు వేసిన మీ పార్టీ రంగులు మార్చడానికి మళ్ళీ కోట్లు ఖర్చు పెడుతున్నారు. దేవుడి స్క్రిప్ట్ అంటే ఇదేనా ముఖ్యమంత్రి @ysjagan గారు? ”
మొత్తం మీద తన పార్టీ రంగు లు పూర్తిగా మార్చకుండా, వాటికి ఎర్ర మట్టి రంగు మాత్రం కొత్తగా చేర్చి, ఆటు హైకోర్టు ఆదేశాలు పాటించినట్లు, ఇటు తమ పార్టీ రంగులు నిలుపుకునేట్లు చేయడం ద్వారా వై ఎస్ ఆర్ సి పి ప్రభుత్వం చాకచక్యత ప్రదర్శించిందని చెప్పాలి