ఆస్కార్ విన్నింగ్ చిత్రం `పారసైట్` నచ్చలేదంటూ రాజమౌళి చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో రకరకాల స్పందనలు వినిపిస్తున్నాయి. అది ఆయన వ్యక్తిగత అభిప్రాయం అని కొందరంటే, ఆస్కార్ స్థాయినే రాజమౌళి ప్రశ్నిస్తున్నాడా? అంటూ కొంతమంది విమర్శనా బాణాలు సంధించారు. ఈలోగా ఆస్కార్ అవార్డులపై మరో సంచలన వ్యాఖ్య చేశాడు రాజమౌళి.
“పారసైట్ నాకు నచ్చకపోవడమనేది నా వ్యక్తిగత అభిరుచి. జ్యూరీ ప్రమాణాలంటారా, అక్కడ కూడా లాబీయింగ్ ఉంటుంది. ఓ సినిమా జ్యూరీ సభ్యులు చూడాలంటే చాలా తతంగమే నడుస్తుంది“ అని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు రాజమౌళి. అయినా సరే.. జ్యూరీ ప్రమాణాల్ని పాటిస్తుంటుందని ప్రపంచం మొత్తం నమ్ముతుందని, ఓ చెత్త సినిమాకు అవార్డు ఇచ్చే పరిస్థితి ఉండదని, గతంలోనూ ఆస్కార్ సాధించిన చాలా సినిమాలు తనకు నచ్చలేదని చెప్పుకొచ్చాడు. ఆస్కార్‌పైనే కాదు, అవార్డు విన్నింగ్ సినిమాలన్నింటిపైనా ఇలాంటి విమర్శలు, అభిప్రాయాలే వ్యక్తం అవుతుంటాయి. అవార్డు సినిమా అంటే బోరింగ్ సినిమానే అనే అభిప్రాయం చాలామందిలో ఉంది. ఆస్కార్ అందుకు అతీతం కాదు. మరి తాజాగా ఆస్కార్‌పై రాజమౌళి చేసిన ఈ వ్యాఖ్యలు ఎలాంటి విమర్శలకు దారి తీస్తాయో చూడాలి.