అసెంబ్లీలో రాజధాని తరలింపు బిల్లులు పాస్ అవకుండా.. తరలింపు ప్రక్రియ చేపట్టబోమని ఏపీ సర్కార్ ..హైకోర్టుకు స్పష్టంగా చెప్పింది. ఈ మేరకు ప్రమాణపత్రం దాఖలు చేయాలని హైకోర్టు కూడా ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఓ వైపు హెల్త్ ఎమెర్జెన్సీ ఉన్నా ఎగ్జిక్యూటివ్ కేపిటల్‌ను విశాఖఖు తరలించడానికి ప్రభుత్వం అంతర్గతంగా ఏర్పాట్లు చేస్తోందని దాఖలైన పిటిషన్లపై హైకోర్టు విచారణ జరిపింది. రాజధాని తరలింపును ఎవరూ అడ్డుకోలేరంటూ .. విజయసాయిరెడ్డి రెండు రోజుల క్రితం… విశాఖలో వ్యాఖ్యానించారు. ఆ వ్యాఖ్యలను పిటిషనర్ల తరపు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అలాగే ఉద్యోగ సంఘాల నేతలు కూడా.. విశాఖకు వెళ్లడానికి రెడీగా ఉన్నామని చెబుతున్నారు. దీన్ని కూడా పిటిషనర్ తరపు న్యాయవాదులు న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు.
ఎక్కడ ఉన్నా.. తక్షణమే విధుల్లో చేరాలంటూ వివిధ శాఖ ఉద్యోగులకు ఉన్నతాధికారులు సమాచారం ఇస్తున్నారు. అదే సమయంలో.. విశాఖలో పాజిటివ్ కేసులు అతి తక్కువగా నమోదవుతున్నాయి. 22 కేసులు నమోదయితే.. 19 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పుడు అక్కడ మూడు మాత్రమే యాక్టివ్ కేసులు మాత్రమే ఉన్నాయి. ప్రస్తుతం రాజధాని ప్రాంతం ఉన్న కృష్ణా, గుంటూరు జిల్లాల్లో విపరీతంగా కేసులు నమోదవుతున్నాయి. దీంతో అక్కడ… రెండు,మూడు నెలల పాటు రెడ్ జోన్ కొనసాగే అవకాశం కనిపిస్తోంది. అది కూడా… కొత్త కేసులు నమోదవకపోతే. లేకపోతే పరిపాలనా సౌలభ్యం కోసం అయినా.. గ్రీన్ జోన్ గా ఉండే.. విశాఖ నుంచి పరిపాలన సాగిస్తారన్న ప్రచారం కూడా జరుగుతోంది. విజయసాయిరెడ్డి ప్రకటనలు కూడా అదేలా ఉండటంతో హైకోర్టులో రైతులు పిటిషన్ వేశారు.
రాజధానిని తరలించబోమని.. అఫిడవిట్ దాఖలు చేయమని హైకోర్టు ఆదేశించడంతో.. అడ్వకేట్ జనరల్ పది రోజుల సమయం అడిగారు. దానికి హైకోర్టు అంగీకారం తెలిపింది. కేంద్రం కూడా అఫిడవిట్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. ఈలోపు రాజధాని తరలింపుపై ఎలాంటి చర్యలు తీసుకున్నా.. ధర్మాసనం దృష్టికి తీసుకురావాలని పిటిషనర్లకు హైకోర్టు తెలిపింది. అయితే…గతంలోనూ… ఇలాంటి హామీలను ప్రభుత్వం హైకోర్టుకు ఇచ్చింది. అయినా ఆ తరవాత కర్నూలుకు కార్యాలయాల తరలింపు ఉత్తర్వులు ఇచ్చింది ప్రభుత్వం.