కరోనాపై పోరాటంలో తెలంగాణ సర్కార్ను… విమర్శించడం కంటే… రైతు సమస్యల కోసం పోరాడితేనే ఎక్కువ మైలేజీ వస్తుందని… తెలంగాణ బీజేపీ నేతలు నిర్ణయానికి వచ్చారు. తెలంగాణ బీజేపీ కొత్త అధ్యక్షుడు బండి సంజయ్.. ఈ విషయంలో దూకుడుగా ముందుకెళ్తున్నారు. హైదరాబాద్ బీజేపీ ఆఫీసులో రైతుల్ని ఆదుకోవాలంటూ నిరాహారదీక్ష చేశారు. అన్ని చోట్లా.. బీజేపీ నేతలందరూ.. తమ తమ ఇళ్లలో దీక్షలు చేయాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం తెలంగాణ పంటల కొనుగోలు సీజన్ నడుస్తోంది. ప్రభుత్వమే అన్ని పంటలను కొనుగోలు చేస్తామని ప్రకటించింది. అయితే.. కొన్ని కొన్ని చోట్ల.. ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయి.
మిల్లర్లు కూడా ధాన్యం కొనుగోలు చేసేలా ప్రభుత్వం ప్రోత్సాహిస్తోంది. గిట్టుబాటు ధర ఇచ్చి వారు ఊళ్లలోనే కోనుగోలు చేస్తున్నారు. ఐకేపీ కేంద్రాల ద్వారా కొనుగోళ్లు జరుగుతున్నాయి. అయితే.. రైతులకు తరుగు పేరుతో.. తడి పేరుతో… అధికారులు లేనిపోని కొర్రీలు పెడుతూండటంతో… పెద్దగా కొనుగోలు జరగడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. సిరిసిల్లలో ఓ చోట రైతులు… ధాన్యాన్ని తగులబెట్టి నిరసన వ్యక్తం చేశారు. దీన్నే బీజేపీ అస్త్రంగా మార్చుకుంది. బండి సంజయ్ దీక్షతో… ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. అధికారులే దళారీలుగా మారారని … క్షేత్రస్థాయిలో మంత్రులు పర్యటిస్తే వాస్తవాలు తెలుస్తాయని బండి సంజయ్ అంటున్నారు.
వైరస్ ప్రభావం.. లాక్ డౌన్ కారణంగా.. దేశం మొత్తం రైతులు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. ఎగుమతి అవకాశాలు నిలిచిపోవడం… రవాణా పూర్తిగా ఆగిపోవడంతో దగ్గర ఉన్న సిటీ మార్కెట్లలో అమ్ముకుందామనుకున్నా సాధ్యం కాని పరిస్థితి. ఈ సీజన్లలో వచ్చే పుచ్చకాయ, మామాడి, ద్రాక్ష వంటి పళ్ల రైతులు కూడా… అమ్ముకోలేక తంటాలు పడుతున్నారు. పంటలను పొలాల్లోనే వదిలేస్తున్నారు. సహజంగానే ఈ పరిస్థితి రైతుల్లో ఆగ్రహానికి కారణం అవుతోంది. వారి కోసం పోరాడి.. మైలేజీ తెచ్చుకునేందుకు తెలంగాణ బీజేపీ.. గట్టిగానే ప్రయత్నిస్తోంది.