భలే భలే మగాడివోయ్, మహానుభావుడు.. ఈ రెండు సినిమాలూ మారుతి కెరీర్‌ని మలుపుతిప్పాయి. పెద్ద హీరోల దృష్టి మారుతిపై పడేలా చేశాయి. రెండూ డిజార్డర్‌కి సంబంధించిన కథలే. భలే భలే మగాడివోయ్ లో హీరోకి మతిమరుపు. మహానుభావుడులో మాత్రం అతి శుభ్రత. చిన్న కాన్సెప్టులన్ని పట్టుకుని, దాని చుట్టూ వినోదాత్మక కథలు అల్లి సూపర్ హిట్లు కొట్టాడు మారుతి. భలే భలే మగాడివోయ్ కి సీక్వెల్ తీస్తారని ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. నాని కూడా మారుతితో ఈ సినిమా చేయడానికి రెడీగా ఉన్నాడు. అయితే ఇప్పుడు మారుతి ఆలోచన మారింది. భలే భలే మగాడివోయ్, మహానుభావుడు రెండు సినిమాల్నీ కలిపి – ఓ కథ రాయబోతున్నాడట. అంటే ఈ కథలో.. మతిమరుపు, అతి శుభ్రత రెండు లక్షణాలూ కనిపిస్తాయి.
“భలే భలే మగాడివోయ్, మహానుభావుడు ఈ రెండు సినిమాల్లోని హీరో క్యారెక్టరైజేషన్‌ని కలుపుకుంటే మరొ గమ్మత్తైన కథ పుడుతుందని అనిపిస్తోంది. ఇంకా ఈ ఆలోచన ప్రాధమిక దశలోనే ఉంది. అయితే నా రాబోయే సినిమా పూర్తి వినోదాత్మకమైనది. కథలో హీరోకి ఎలాంటి ఆరోగ్య సమస్యలూ ఉండవు. ఆరోగ్యకరమైన హాస్యం తప్ప” అని క్లారిటీ ఇచ్చారు మారుతి. రెండు సినిమాల్ని కలిపి సీక్వెల్ చేసే ఆలోచన కొత్తదే. అందులో ఇద్దరు హీరోలు (నాని, శర్వానంద్) నటిస్తే ఇంకా కొత్తగా ఉంటుంది. మారుతి ప్లాన్ కూడా అదే కావొచ్చు.