లాక్ డౌన్ వల్ల థియేటర్లు మూతబడ్డాయి. కొత్త సినిమాల ఊసేలేదు. అయితే ఒకవేళ లాక్ డౌన్ ఎత్తేసి, థియేటర్లకు అనుమతులు ఇస్తే ఏం చేయాలన్న విషయంలో తెలుగు నిర్మాతలు ఇప్పటికే ఓ నిశ్చితమైన అభిప్రాయానికి వచ్చేశారు. థియేటర్లు తెరచుకుంటే, ఒక్కసారిగా సినిమాల ఫ్లోటింగ్ మొదలవుతుంది. రిలీజ్ డేట్లు ప్రకటించుకుంటారు. విడుదల తేదీ విషయంలో నిర్మాతల మధ్య క్లాష్ వచ్చే ప్రమాదం ఉంది. ఈ సంగతి ముందే గ్రహించిన ప్రొడ్యూసర్ గిల్డ్ ఇప్పటికే నిర్మాతలకు స్పష్టమైన సంకేతాల్ని ఇచ్చింది.
ఇది వరకు రిలీజ్డేట్లు ప్రకటించుకున్న సినిమాలకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలని గిల్డ్ నిర్ణయించింది. మార్చి, ఏప్రిల్ లో విడుదల కావడానికి కొన్ని సినిమాలు సిద్ధమయ్యాయి. రిలీజ్ డేట్లు కూడా ప్రకటించుకున్నాయి. థియేటర్లు ఎప్పుడు తెరచుకున్నా సరే, ముందు ఆ సినిమాలకే ప్రాధాన్యం ఇవ్వాలని గిల్డ్ నిర్ణయించింది. సెన్సార్ అయిపోయిన సినిమాలకూ ముందస్తు ప్రాధాన్యం ఇస్తారు. ఆ తరవాతే మిగిలిన సినిమాలొస్తాయి. ఒకేసారి రెండు మూడు సినిమాలు రావడం వల్ల నిర్మాతలకే ఎక్కువ నష్టం. ప్రేక్షకుల్ని ఆయా సినిమాలు పంచుకోవాల్సివస్తుంది. పైగా లాక్ డౌన్ తరవాత ప్రేక్షకుల మైండ్ సెట్ ఎలా ఉంటుందో తెలీదు. ఇలాంటి సమయంలో ఒకేసారి సినిమాలన్నీ గుంపుగా రావడం కూడా కరెక్ట్ కాదు. అందుకే.. ఫస్ట్ కమ్స్ ఫస్ట్ ప్రాతిపదికపై ముందే రిలీజ్ డేట్ ప్రకటించుకుని, లాక్ డౌన్ వల్ల ఆగిపోయిన సినిమాలే విడుదల కానున్నాయి. ఈ విషయంలో డి.సురేష్ బాబు మాట్లాడుతూ “రిలీజ్ డేట్ల విషయంలో అసలు మాకు సమస్యే లేదు. లాక్ డౌన్ కంటే ముందే పూర్తయిపోయిన సినిమాలకు తొలి ప్రాధాన్యం. అయితే సమస్య ఇప్పుడు రిలీజ్ డేట్ల గురించి కాదు. లాక్ డౌన్ ఎత్తేశాక పరిస్థితులు ఎలా ఉంటాయన్నదే ప్రధానం. వాటిపై ఇప్పుడే ఓ అంచనాకు రాలేం” అన్నారు.