తెలంగాణలో రాను రాను వైరస్ పాజిటివ్ కేసులు తగ్గుతున్నాయి. మూడు రోజుల నుంచి రోజుకు ఇరవై లోపే బయటపడుతున్నాయి. గత ఇరవై నాలుగు గంటలలో పదమూడు పాజిటివ్ కేసులు మాత్రమే లెక్క తేలినట్లు మంత్రి ఈటల రాజేందర్ ప్రకటించారు. ఐదు వందలకుపైగా పరీక్షలు నిర్వహించామన్నారు. ఈ ఒక్క రోజు 29 మంది డిశ్చార్ అయ్యారు. ఇక నుంచి రోజుకు యాభై మంది చొప్పున డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉందన్నారు. ఇప్పటికి డిశ్చార్జ్ అయినవారి సంఖ్య 291. మొత్తం నమోదైన కేసు సంఖ్య 983 కాగా.. మృతులు, డిశ్చార్జ్ అయిన వారి సంఖ్యను తీసేస్తే.. యాక్టివ్ గా ఉన్న కేసులు 663 మాత్రమే. వీరిలో ఏడుగురు పరిస్థితి సీరియస్గా ఉంది. వారందరూ వెంటిలేటర్లపై ఉన్నారు. మిగిలిన వారందరూ చురుగ్గానే ఉన్నారని మంత్రి చెబుతున్నారు.
వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కొంత మంది వల్లనే వైరస్ వ్యాప్తి చెందిందని గుర్తించారు. హైదరాబాద్లో వెలుగు చూసిన కేసుల్లో 44 కుటుంబాల ద్వారా 265 మందికి..సూర్యాపేటలో 25 కుటుంబాల నుంచి 83 మందికి సోకింది. ఇప్పుడు ఆయా ప్రాంతాల్లో పటిష్టంగా లాక్ డౌన్ అమలు చేస్తున్నామని.. రాను రాను.. కేసుల సంఖ్య తగ్గిపోతుందని.. తెలంగాణ సర్కార్ ఆశాభావంతో ఉంది. తెలంగాణ సర్కార్ ప్లాస్మా ధెరపికి కూడా అనుమతి పొందింది. పరిస్థితి విషమించిన రోగులకు ప్లాస్మా ధెరపి చికిత్స చేయాలని నిర్ణయించుకుంది.
కరోనా పాజిటివ్ కేసులు పూర్తిగా అదుపులోకి వచ్చే వరకూ.. కఠినంగా లాక్ డౌన్ అమలు చేయాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించుకుంది. తమ చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నట్లుగా కనిపిస్తూండటంతో.. పట్టు విడవకూడదని నిర్ణయించుకుంది. అందుకే.. క్వారంటైన్ సమయాన్ని ఇరవై ఎనిమిది రోజులకు పెంచింది. ఇక నుంచి అనుమానితుల్ని 28రోజులు పరిశీలనలో ఉంచిన తరవాత మాత్రమే బయటకు పంపుతారు. రెడ్ జోన్ల విషయంలోనూ.. ఇరవై ఎనిమిది రోజుల నిబంధన విధించనున్నారు. ఆయా ప్రాంతాల నుంచి ఎవరూ బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.