వైరస్‌పై తీసుకుంటున్న చర్యల నేపధ్యంలో.. పరిస్థితులు చేయిదాటిపోతున్నాయి అనుకుంటున్న కొన్ని నగరాలకు కేంద్రం ప్రత్యేక బృందాలను పంపుతోంది . ఆ నగరాల జాబితాలో హైదరాబార్ను కూడా చేర్చారు. తెలంగాణలోని పాజిటివ్ కేసుల్లో 485 కేసులు హైదరాబాద్‌లోనే నమోదయ్యాయి. కేంద్ర బృందం క్షేత్రస్థాయిలో పర్యటించి పరిస్థితిని అంచనా వేస్తాయి. లాక్డౌన్ అమలవుతున్న తీరు, కేంద్రం జారీ చేసిన మార్గదర్శకాల అమలు, నిత్యావసర సరుకుల సరఫరా, వైద్య సదుపాయాల సన్నద్ధత, వైద్యులు, వైద్య సిబ్బందికి రక్షణ, పేద ప్రజలు, కార్మికులకు ఏర్పాటు చేసిన క్యాంపుల్లో పరిస్థితి.. తదితర అంశాలను ఈ బృందం పరిశీలిస్తుంది. లోపాలుంటే పరిష్కరించడానికి రాష్ట్ర అధికార యంత్రాంగానికి తగిన సూచనలు, ఆదేశాలు ఇస్తుంది. క్షేత్రస్థాయి పరిస్థితిపై కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తుంది.
అయితే… బీజేపీయేతర రాష్ట్రాల్లో ఈ కేంద్ర బృందాల పర్యటన రాజకీయం అవుతోంది. బెంగాల్లో కేంద్ర బృందాల పర్యటనకు… అక్కడి సీఎం మమతా బెనర్జీ అంగీకరించలేదు. సహకరించలేదు. దాంతో అక్కడి బృందాలు క్షేత్ర స్థాయిలో పర్యటించడానికి ఇక్కట్లు పడ్డాయి. దీనిపై కేంద్ర హోంశాఖ… మమతా ప్రభుత్వానికి రెండు సార్లు హెచ్చరికలతో కూడిన లేఖలు పంపింది. దీంతో ఇతర రాష్ట్రాల్లో కేంద్ర బృందాల పర్యటనపైనా రాజకీయ అనుమామేఘాలు కమ్ముకున్నాయి. అందుకే కేంద్రం ముందస్తుగానే ఓ ప్రకటనచేసింది. కేంద్ర బృందాలను, సీనియర్ అధికారులను రాష్ట్రాలకు పంపిస్తున్నది ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు సహకరించేందుకే తప్ప పర్యవేక్షణకు కాదని క్లారిటీ ఇచ్చింది.
రాష్ట్రాల్లో పర్యటించే కేంద్ర బృందాలు సమర్పించే నివేదికల ద్వారా తమకు ఆయా రాష్ట్రాల్లో కరోనా పరిస్థితి తెలుస్తుందని కేంద్రం చెబుతోంది. అయితే.. ప్రభుత్వాలు నిజం చెప్పడం లేదని భావిస్తూండటం… చెప్పిన దానికన్నా.. తీవ్రత ఎక్కువగా ఉందని కేంద్రం అనుమానిస్తూండటం వల్లనే.. కేంద్ర బృందాలను పంపుతున్నారని… అధికారవర్గాలు చెబుతున్నాయి. ఈ కారణంగానే.. రాజకీయదుమారం రేగుతోందటున్నారు.