వైరస్ వ్యాప్తికి వైసీపీ నేతలు లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించి చేస్తున్న ర్యాలీలు, రాజకీయ సభలే కారణమని తీవ్రమైన ఆరోపణలు వస్తున్నా.. పట్టించుకోని పోలీసులు… ఇతర పార్టీల నేతలు… జిల్లా సరిహద్దు దాటినా క్వారంటైన్ నోటీసులు ఇచ్చేస్తున్నారు. ఇలా.. బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డికి ఇవ్వడంతో కొత్త వివాదం ప్రారంభమయింది. విష్ణువర్ధన్ రెడ్డి అనంతపురం జిల్లా కదిరిలో నివాసం ఉంటారు. ఆయన కర్నూలు జిల్లాకు వెళ్లి వచ్చారు. వెంటనే.. ఆయన ఇంటికి సీఐ, ఎస్ఐలు.. హోం క్వారంటైన్ నోటీసులు అంటించారు. ఇది తెలిసిన వెంటనే.. విష్ణువర్ధన్ రెడ్డి భగ్గుమన్నారు. రాష్ట్రం మొత్తం కలియతిరుగుతున్న వైసీపీ నేతలు నేతలు.. కళ్లకు కనిపించడం లేదా అని ప్రశ్నలు ప్రారంభించారు. వారు అధికారపక్ష నేతలు… ప్రతిపక్ష నేతలందరికీ.. వేరే చట్టం ఉంటుందని సరిపెట్టుకోవడానికి లేదని…తాను అధికారపక్షమేనని విష్ణువర్ధన్ రెడ్డి వాదించడం ఈ వ్యవహారంలో కీలక అంశం.
విష్ణువర్ధన్ రెడ్డి చెప్పే అధికారపక్షం రాష్ట్రం కాదు..కేంద్రం. విష్ణువర్ధన్ రెడ్డికి.. కేంద్ర ప్రభుత్వం ఓ నామినేటెడ్ పదవి ఇచ్చింది. నెహ్రూ యువకేంద్రం వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు. దానికి కేంద్ర సహాయమంత్రి హోదా ఉంటుంది. అలాంటిది.. తనకు దేశంలో ఎక్కడికైనా వెళ్లే అవకాశం ఉందని.. తనకు నోటీసులు ఇవ్వడం ఏమిటని వాదించడం ప్రారంభించారు. పోలీసులు తెలియక ఇచ్చారని.. వైసీపీ నేతలు మిడిమిడి జ్ఞానంతో వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. పోలీసులు ఎందుకు నోటీసులు ఇచ్చినా… విష్ణువర్ధన్ రెడ్డి మాత్రం.. ఈ అంశాన్ని తన వాదనా పటిమతో మీడియాలో హైలెట్ చేశారు. చర్చకు పెట్టారు.
వైసీపీ నేతలు.. ఇంతలా కరోనా వ్యాప్తికి కారణమైనా.. లాక్ డౌన్ ఉల్లంఘించినా.. కనీసం నోటీసులు కాదు కదా.. అలాంటి వారిని ఇంట్లోనే ఉండమని కూడా..ఆదేశాలు ఇవ్వలేకపోతున్నారు పోలీసులు. కానీ.. విపక్ష నేతల విషయంలో మాత్రం.. ఒకటికి రెండు సార్లు ఉత్సాహం ప్రదర్శిస్తున్నారు. లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించారంటూ.. కొంత మందిపై కేసులు కూడా పెట్టారు. అధికార పార్టీకి ఓ న్యాయం.. విపక్ష నేతలకు ఓ న్యాయం అనే అంశాన్ని.. విష్ణువర్దన్ రెడ్డి వ్యవహారం తెరపైకి తెచ్చింది. ఇక్కడ ఎవరైనా అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే.. వైరస్ ఎవరికీ అతీతం కాదనే. కానీ అందరూ తమకు వైరస్ రాదనే అనుకుని..తిరిగేస్తున్నారు.