యాంకర్‌గా సుపరిచితుడు ప్రదీప్. కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో కనిపించాడు. ఇప్పుడు హీరోగా అవతారం ఎత్తాడు. `30 రోజుల్లో ప్రేమించడం ఎలా?` పేరుతో ఓ సినిమా తయారైంది. నిజానికి ఈ సినిమా గురించి ఎవ్వరికీ తెలీదు. `నీలీ నీలీ ఆకాశం ఇద్దామనుకున్నా` అనే పాట రాకపోతే – ఇప్పటికీ ఇలాంటి సినిమా ఒకటి రెడీ అవుతోందన్న విషయం జనాలకు తెలిసేది కాదు. సిద్ద్ శ్రీరామ్ పాడిన ఆ పాట సూపర్ హిట్టవ్వడంతో ఒక్కసారిగా ఈ సినిమాపై ఫోకస్ పెరిగింది.
లాక్‌డౌన్‌కి ముందే విడుదల కావాల్సిన సినిమా ఇది. పరిస్థితుల్ని చూసి భయపడిన నిర్మాతలు సినిమాని వాయిదా వేశారు. ఆ తరవాత లాక్ డౌన్ కొనసాగడంతో ఈ సినిమా విడుదల కాకుండా ఆగిపోయింది. ఇలాంటి చిన్న సినిమాల్ని వెదికి పట్టే పనిలో పడిన ఓటీటీ సంస్థల దృష్టి `30 రోజుల్లో ప్రేమించడం ఎలా` సినిమాపై పడింది. అయితే నిర్మాతలు మాత్రం ఈ సినిమాని ఓటీటీకి అమ్మడానికి ఇష్టపడడం లేదు. దానికి కారణం.. బడ్జెట్టే. ఈ సినిమాపై ఇప్పటి వరకూ 4.5 కోట్లు పెట్టారు నిర్మాతలు. ప్రదీప్‌పై అది పెద్ద మొత్తమే. మూడేళ్ల క్రితం మొదలైన సినిమా ఇది. మేకింగ్‌కి 2 కోట్లయితే.. కోటి రూపాయలు ప్రమోషన్ కోసం ఖర్చు పెట్టారు. మిగిలినదంతా వడ్డీ లెక్కలు. సినిమా విడుదలై, సూపర్ హిట్టయితే.. తమ డబ్బులు తిరిగొస్తాయన్నది నిర్మాతల ఆశ. ఓటీటీ సంస్థలకు పెట్టుబడితే పనేముంది? కోటికీ, కోటిన్నరకీ ఈ సినిమాని కొనేద్దామని చూస్తున్నారు. ఈ సినిమాపై నమ్మకంతో గీతా ఆర్ట్స్ రూ.40 లక్షల అడ్వాన్స్ ఇచ్చి, విడుదల చేయడానికి రెడీ అయ్యింది. థియేటర్లో విడుదల కాకపోతే.. నిర్మాతలు భారీగా నష్టపోవాల్సి వస్తుంది. అందుకే.. నిర్మాతలు కూడా ఏమాత్రం కంగారు పడకుండా, ఓటీటీ సంస్థల బేరాలకు లొంగకుండా… లాక్ డౌన్ ఎత్తివేత ప్రకటన కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.