మే మూడో తేదీ వరకు లాక్ డౌన్ పొడిగించినప్పటికీ.. రోజుకో రిలీఫ్ ఇస్తూ పోతోంది కేంద్ర ప్రభుత్వం. శుక్రవారం అర్థరాత్రి విడుదలైన ఆదేశాల్లో.. దేశవ్యాప్తంగా షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్ మెంట్ యాక్ట్ కింద నమోదైన దుకాణాలన్నింటినీ తెరుచుకోవచ్చని రిలీఫ్ ఇచ్చింది. అయితే.. కొన్ని నిబంధనలు విధించింది. కేంద్ర పాలసీని యథాతథంగా అమలు చేస్తున్న రాష్ట్రాల్లోనే ఇది వర్తిస్తుంది. సొంతంగా లాక్ డౌన్ ప్రకటించుకున్న రాష్ట్రాల్లో మాత్రం ఇవి వర్తించవు. అంటే తెలంగాణ, ఒడిశా, పంజాబ్ లాంటి రాష్ట్రాల్లో రాష్ట్ర ప్రభుత్వాలే సంపూర్ణ లాక్ డౌన్ ప్రకటించాయి. ఆయా రాష్ట్రాల్లో షాపులు తెరవడానికి అవకాశం లేదు. ఏపీ సహా కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం రూల్స్ అమలు చేస్తున్న రాష్ట్రాల్లో దుకాణాలు తెరుచుకోవచ్చు.
ఎలాంటి మినహాయింపులైనా రెడ్ జోన్లు, కంటెన్మెంట్ జోన్లకు వర్తించవు. అలాగే..షాపింగ్ మాల్స్ తెరవడానికి అవకాశం లేదు. కిరాణా షాపులు, నిత్యవసర, అత్యవసర, మందులు, ఫార్మసీ షాపులు తెరవడానికి ఇప్పటి వరకూ అవకాశం ఉంది. రెండు రోజుల క్రితం ఎలక్ట్రికల్ దుకాణాలు, స్టేషనరీ దుకాణాలు తెరుచుకోవడానికి చాన్స్ ఇచ్చింది. తర్వాత మరో రోజులోనే.. అన్ని దుకాణాలను తెరవడానికి అవకాశం కల్పించింది. తెరిచే ప్రతీ దుకాణం కొన్ని నిబంధనలు పాటింంచాల్సి ఉంటుంది. సామాజిక దూరంపాటిస్తూ,మాస్క్, శానిటేజర్లు వాడుతూ, కేంద్రం, వివిధప్రభుత్వాలు ఇచ్చిన ఈ వెసులుబాటును వినియోగించుకోవాల్సి ఉంటుంది. సగం మంది ఉద్యోగులతోనే పని చేయించుకోవాలి.
లాక్ డౌన్ కారణంగా… ఎక్కడివక్కడ ఆగిపోవడంతో ఆర్థిక కార్యకలాపాలు నిలిచిపోయాయి. అంతే కాకుండా ప్రజలకు రోజువారీ జీవితానికి అవసరమైన వస్తువులు కూడా దొరకడం గగనంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో మెల్లగా అయినా జన జీవనాన్ని సాధారణ పరిస్థితికి తీసుకు రావాలంటే.. మినహాయింపులు తప్పవని కేంద్రం భావిస్తోంది. ఈ మేరకు… ఒక్కొక్కటిగా సడలింపులు ఇస్తోంది. రెడ్ జోన్లు, కంటెయిన్మెంట్ జోన్ల విషయంలో సీరియస్గా ఉండి.. ఇతర చోట్ల రిలీఫ్ ఇస్తే చాలని భావిస్తోంది.