విక్లీ, మంత్లీ మైగజైన్లకు ఎప్పుడో కాలం చెల్లిపోయింది. స్వాతి, నవ్యలాంటి వార పత్రికలు కాస్త నెట్టుకురాగలుగుతున్నాయి. ఇప్పుడు వాటి ఉనికీ ప్రమాదంలో పడింది. లాక్ డౌన్ వల్ల ‘స్వాతి’ పత్రిక రావడం లేదు. కనీసం ఆన్ లైన్లోనూ అందుబాటులో లేదు. ‘నవ్య’ పరిస్థితీ అంతే. సాహితీ లోకానికి ‘నవ్య’ సుపరిచితమైన వార పత్రికే. కథలు, సీరియల్స్‌కి ప్రసిద్ధి. ‘నవ్య’ నిర్వహించే కథల పోటీ తో చాలామంది రచయితలు వెలుగులోకి వచ్చారు. లాక్ డౌన్ కారణంగా కొన్ని వారాలుగా పత్రిక రావడం లేదు. లాక్ డౌన్ ఎత్తేసిన తరవాత, పరిస్థితులు మామూలైన తరవాత… ‘స్వాతి’ని మళ్లీ పునరుద్ధరిస్తారు. కానీ ‘నవ్య’ పరిస్థితి మాత్రం అనుమానమే. నవ్య ఇక పూర్తిగా దూరమయ్యే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ప్రస్తుతానికైతే ‘నవ్య’ సిబ్బంది ఇంటికే పరిమితమైంది. వాళ్లకు నెలరోజుల నుంచీ పని లేదు. జీతమూ లేదు. కాకపోతే.. ‘నవ్య’ నుంచి పిలుపొస్తుందని వాళ్లంతా ఆశగా ఎదురు చూస్తున్నారు. ‘ఆంధ్రజ్యోతి’లో నవ్య ఓ భాగం. ఇది వరకు `ఆంధ్రజ్యోతి` పేరుతోనే ఈ వీక్లీ నడిచేది. ఆ తరవాత `నవ్య`గా మారింది. లాక్ డౌన్ ఎత్తేశాక నవ్య సిబ్బంది పరిస్థితి ఏమిటో. యాజమాన్యం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.