పవన్ కల్యాణ్ – క్రిష్ కాంబినేషన్లో ఓ సినిమా రూపుదిద్దుకుంటోంది. విరూపాక్ష అనే టైటిల్ పరిశీలిస్తున్నారు. మొఘలాయిల కాలం నాటి కథ ఇది. ఓ వజ్రం చుట్టూ తిరుగుతుంది. అప్పటి కాలమాన పరిస్థితుల్ని జోడిస్తూ.. ఓ దొంగ కథ చెప్పబోతున్నారు. హిస్టారికల్ కథకి ఫిక్షన్ జోడిస్తున్నారన్నమాట. అయితే.. ఇదో పొలిటికల్ సెటైర్ అని కూడా సమాచారం అందుతోంది.
పవన్ ఇప్పుడు రాజకీయాల్లో చురుగ్గా ఉన్నాడు. తెరపై హీరోగా చూస్తున్నా – ఎక్కడో ఓ చోట తనలోని పొలిటికల్ లీడర్ కనిపిస్తూనే ఉంటాడు. పవన్ ఏమైనా చెబితే.. అందులో పొలిటికల్ కోణం ఉందా? అనేది అభిమానులూ ఆలోచిస్తుంటారు. దానికి తగ్గట్టుగానే ఈ సినిమాలో కొన్ని సన్నివేశాల్ని డిజైన్ చేసినట్టు తెలుస్తోంది. తుగ్లక్‌కి సంబంధించిన ఓ ఎసిసోడ్ ఈ కథలో ఉంది. ఆ ఎపిసోడ్‌ని ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై సెటైర్‌గా వాడుకుంటున్నారని తెలుస్తోంది. సన్నివేశాన్ని సన్నివేశంలా చూస్తే మాత్రం.. ఏం తెలీదు గానీ, ప్రస్తుత రాజకీయాలకు అన్వయించుకుంటే అది ఓ ప్రముఖ రాజకీయ నేతపై విసిరిన విమర్శనాస్త్రంగా ఉండబోతోందని టాక్. మరి ఆ విమర్శలు ఎవరిపైనో, ఆ సెటైర్ ఎలా పేలుతుందో తెలియాలంటే ఇంకొంత కాలం ఆగాలి.