కరోనాపై పోరాటం విషయంలో అగ్ర తారలంతా ధీటుగా స్పందించారు. హీరోలు భారీ విరాళాలు ఇచ్చారు. తమదైన స్థాయిలో సహాయం చేస్తున్నారు. ఈ విషయంలో కథానాయికలు మరీ పిసినారి తనం చూపిస్తూ వచ్చారు. ఒకరిద్దరు మినహా… పెద్దగా స్పందించిన వాళ్లెవరూ లేరు. టాప్ కథానాయికలు సైతం మొండి చేయి చూపించారు. ఫేస్ బుక్, ట్విట్టర్లలో సోది మాటలు, పనికిరాని వీడియోలతో కాలక్షేపం చేస్తున్నారు.
వీరందరి మధ్య ప్రణీత అందరి హృదయాల్ని గెలుచుకుంటోంది. అత్తారింటికి దారేది లాంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది ప్రణీత. ఎక్కువ సార్లు సెకండ్ హీరోయిన్ పోస్టుకే పరిమితం అయ్యింది. ఇప్పుడామె చేతిలో సినిమాలు కూడా లేవు. కాకపోతే.. కరోనా విరాళాల్ని ప్రకటించి మొట్టమొదటి తెలుగు కథానాయిక తనే. లక్ష రూపాయల విరాళాన్ని ప్రకటించి సెభాష్ అనిపించుకుంది. ఆ తరవాత తన ఇంటి చుట్టు పక్కల ఉన్నవాళ్లకు నిత్యావసర వస్తువుల్ని అందించి ఇతోదికంగా సాయం చేసింది. ఇప్పుడు అన్నార్తుల ఆకలి మంటల్ని తీరుస్తోంది. స్వయంగా వండి, వార్చి, ఆహార పొట్లాల్ని తయారు చేసి బీదలకు పంచుతోంది. చేతిలో సినిమాలు లేకపోయినా.. సమాజానికి ఏదో ఒకటి చేయాలి అనుకుని ముందుకు రావడం సంతోషకరమైన పరిణామం. ప్రనీత పెద్ద మనసుకు నిదర్శనం.