ఆంధ్రప్రదేశ్లో కరోనా పాజిటివ్ కేసులు తగ్గడం లేదు. గత ఇరవై నాలుగు గంటల్లో కొత్తగా81 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ 81లో 52 ఒక్క కృష్ణా జిల్లాలోనే నమోదయ్యాయి. వెస్ట్ గోదావరి జిల్లాలో మరో 12 నమోదయ్యాయి. తాజా కేసులతో కలిపి ఏపీలో మొత్తం పాజిటివ్ కేసులు 1097కి చేరగా.. యాక్టివ్ కేసులు 835గా మిగిలాయి. చికిత్స చేయించుకుని 231 మంది డిశ్చార్జ్ అయ్యారు. నిన్నామొన్నటి వరకు కర్నూలు, గుంటూరు జిల్లాల్లో రోజువారీగా భారీగా కేసులు నమోదయ్యేవి. గత ఇరవై నాలుగు గంటల్లో ఆ జిల్లాల్లో నాలుగు, మూడు మాత్రమే తేలాయి. కృష్ణా జిల్లాలో మాత్రం అర్థసెంచరీ దాటిపోయింది. దీంతో మొత్తం కృష్ణా జిల్లాలో 177 కేసులుగా తేలింది.
177 కేసుల్లో అత్యధికం విజయవాడ నగరంలోనే నమోదవుతున్నాయి. పాజిటివ్ కేసుల్లో చాలా వరకు… ఎవరికి ద్వారా సోకుతుందో అర్థం కావడం లేదని.. అధికారవర్గాలు చెబుతున్నాయి. సామాజిక వ్యాప్తి సూచనలు కనిపిస్తూండటంతో గత పది రోజులుగా విజయవాడలో సంపూర్ణ లాక్ డౌన్ ప్రకటించారు. అయినప్పటికీ.. ఒక్క రోజే 52 కేసులు వెలుగు చూడటంతో తప్పు ఎక్కడ జరిగిందా అని అధికారులు తలలు పట్టుకుంటున్నారు. కంట్రోల్ చేయడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలా.. అని మేథోమథనం చేస్తున్నారు.
అయితే.. టెస్టులు ఎక్కువగా చేస్తున్నందు వల్లే.. ఎక్కువ కేసులు నమోదవుతున్నాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. దేశంలో ఇంత వరకూ ఏ రాష్ట్రం చేయని విధంగా 68వేలకుపైగా టెస్టులు చేశామని ఏపీ సర్కార్ క్లెయిమ్ చేసుకుంది. ఈ లెక్కన చూస్తే.. పాజిటివ్ కేసులు చాలా తక్కువ స్థాయిలో నమోదవుతున్నాయని చెబుతున్నారు. ఇతర రాష్ట్రాల్లో టెస్టులు చేసిన సంఖ్యలో మూడు శాతం వరకు పాజిటివ్ వస్తున్నాయి..కానీ ఏపీలో అది ఒకటిన్నర శాతం వరకూ మాత్రమే ఉంటోందంటున్నారు. ఈ లెక్కన చూస్తే.. ఏపీలో పరిస్థితులు అదుపులోనే ఉన్నాయంటున్నారు.