కరోనా వల్ల ఏర్పడిన విపత్కర పరిస్థితుల నుంచి – సామాన్య ప్రజల్ని ఆదుకోవడానికి స్టార్లు తరలి వచ్చారు. హీరోలు భారీగా డొనేషన్లు ప్రకటించారు. అయితే… విజయ్‌దేవరకొండ మాత్రం సైలెంట్‌గా ఉండిపోయాడు. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే విజయ్- కరోనా విషయంలో మౌనంగా ఉండడం ఆయన అభిమానులకూ నచ్చలేదు. చాలామంది బాహాటంగానే విమర్శించారు. అయితే విజయ్‌దేవరకొండ పెద్ద ప్లాన్ లో ఉన్నాడని, అందుకు సంబంధించిన ప్రకటన త్వరలో రాబోతోందని ఆయన సన్నిహితులు హింట్ ఇచ్చారు. ఇప్పుడు అందుకు తగిన ప్రణాళికలతోనే విజయ్ ముందుకొచ్చాడు. తన బంగారు మనసు చాటుకున్నాడు.
విజయ్ రెండు ప్రణాళికల్ని ప్రకటించాడు. 1. ఉద్యోగాలు కల్పించడం. 2. అవసరార్థులకు నిత్యావసర వస్తువుల్ని అందించడం.
ఉద్యోగ కల్పన విషయంలో విజయ్ 2019 నుంచీ పనిచేస్తున్నాడు. గ్రామీణ, పట్టణాల్లో ఉండే యువతీ యువకులకు వివిధ రంగాలలో శిక్షణ ఇచ్చి, వాళ్లకు ఉద్యోగాలు కల్పించడం ఈ ప్రాజెక్టు ఉద్దేశం. ఇప్పటి వరకూ 50 మందికి ఉద్యోగాలు లభించాయి. మరో 600 మందికి ఉపాధి కల్పించడం కోసం ఈ ప్రాజెక్టు పనిచేస్తోంది. ఇక రెండోది… నిత్యావసర వస్తువుల పంపిణీ. రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్న 2000 కుటుంబాలకు ఈ నిత్యావసర వస్తువుల్ని అందజేయబోతున్నాడు. ఈ రెండు ప్రాజెక్టుల నిమిత్తం 1.3 కోట్లు కేటాయించాడు విజయ్.
లాక్ డౌన్ హఠాత్తుగా ప్రకటించడం వల్ల, తన దగ్గర నగదు నిల్వలు లేకుండా పోయాయని, తన దగ్గర పనిచేస్తున్న 35 మంది ఉద్యోగులకు జీతాలు ఇవ్వడం కూడా సమస్యగా మారిందని, తన స్నేహితుల దగ్గర నుంచి కొంత సొమ్ము సేకరించి, ఈ ప్రాజెక్టుల కోసం ఉపయోగిస్తున్నానని విజయ్ దేవరకొండ ప్రకటించాడు. కాస్త ఆలస్యమైనా విజయ్ ధీటుగానే స్పందించాడు. తన పెద్ద మనసు చూపించుకున్నాడు.