కేంద్ర హోంమంత్రి అమిత్ షా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఫోన్ చేశారు. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు అంతకంతకూ పెరుగుతున్న సమయంలో… అమిత్ షా ఫోన్ కాల్ .. అధికారవర్గాలను టెన్షన్ కు గురి చేసింది. అయితే.. ఈ నెల ఇరవయ్యో తేదీ నుంచి కేంద్రం కొన్ని సడలింపులు ఇచ్చింది. ఆ తరవాత కూడా… వరుసగా సడలింపులు ఇస్తూ వస్తోంది. ఏపీ సర్కార్.. ఆ సడలింపులను అమలు చేస్తోంది. ఈ సడలింపులు రియాక్షన్స్ ఎలా ఉన్నాయి.. పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయా అన్న అంశాలపై అమిత్ షా ఫీడ్ బ్యాక్ తీసుకున్నట్లుగా చెబుతున్నారు. లాక్ డౌన్ పై ఎగ్జిట్ ప్లాన్ విషయంలో కేంద్రం కసరత్తు చేస్తోంది. దీంతో.. ఏపీలో అనుభవాలు పనికొస్తాయని కేంద్రం భావించినట్లుగా తెలుస్తోంది.
ఏపీలో కేసులు పెరుగుతున్న విషయాన్ని అమిత్ షా దృష్టికి జగన్ తీసుకెళ్లినట్లుగా తెలుస్తోంది. దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా.. ఏపీలో భారీగా టెస్టులు చేస్తున్నామని అమిత్ షాకు జగన్ తెలిపారు. ప్రతి మిలియన్ జనాభాకు అత్యధిక పరీక్షలు నిర్వహించిన రాష్ట్రంగా ప్రథమ స్థానంలో ఉన్నామన్నారు. ఈ వివరాలను అమిత్ షాకు జగన్ వివరించినట్లుగా చెబుతున్నారు. ఇరవై ఏడో తేదీన.. ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రధానమంత్రులతో మరోసారి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం అవుతున్నారు. ఈ సమయంలో.. లాక్ డౌన్ వల్ల ఉపయోగాలు… సడలింపుల పరిస్థితులను పూర్తి స్థాయిలో.. ప్రజెంట్ చేయాలని… ప్రభుత్వం భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.
ప్రస్తుతం ప్రస్తుతానికి రెడ్ జోన్లను మండలాల వారీగా చూసి.. అక్కడ కఠినంగా లాక్ డౌన్ అమలు చేస్తోంది. మిగిలిన చోట్ల రిలీఫ్ ఇస్తోంది. ఇలాంటి పరిస్థితులనే కొనసాగించాలని కోరే అవకాశం ఉందంటున్నారు. అయితే.. కేంద్రం మాత్రం… రిలీఫ్ ఇచ్చినప్పటికీ… లాక్ డౌన్ కొనసాగించాలనే ఆలోచనలో ఉన్నట్లుగా చెబుతున్నారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం అభిప్రాయం చెప్పాల్సిఉంది.