రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్లను కట్ చేయకూడదని ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్ణయించారు. వారికి పూర్తి స్థాయిలో పెన్షన్ చెల్లించాలని నిర్ణయించారు. ఒకటో తేదీ దగ్గర పడుతూండటంతో జీతాల చెల్లింపు విషయంలో ఓ విధానాన్ని ఖరారు చేశారు. పోలీసులు, వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య సిబ్బంది, సచివాలయ ఉద్యోగులకు పూర్తి జీతాలు చెల్లించాలని నిర్ణయించారు. మిగతా అన్ని విభాగాల ఉద్యోగులకు గత నెలలోలాగానే సగం జీతమే ఇవ్వాలని నిర్ణయించారు. గత నెలలో పెన్షనర్లకు కూడా ప్రభుత్వం సగం కోత పెట్టింది. అయితే ఈ విషయంపై తీవ్రమైన విమర్శలు వచ్చాయి. ఉద్యోగులు తమ సర్వీస్ అంతా కష్టపడితే పెన్షన్ వస్తోందని… రిటైరైన వయసులో వారికి వైద్య ఖర్చులు సహా అనేక అవసరాలు ఉంటాయని… అలా కట్ చేయడం సరి కాదన్న అభిప్రాయం వినిపించింది.
మాజీముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఇదే అంశాన్ని వివరిస్తూ.. పెన్షన్లు కట్ చేయవద్దని విజ్ఞప్తి చేస్తూ ఓ లేఖ రాశారు. అదే సమయంలో.. ఏపీ హైకోర్టులోనూ ఓ పిటిషన్ దాఖలైంది. ప్రముఖ న్యాయవాది జంధ్యాల రవిశంకర్.. పెన్షనర్లకు యాభై శాతం కత్తిరించడం చట్ట విరుద్ధమని పేర్కొంటూ లేక రాశారు. దీనిపై ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాల్సి ఉంది. ఈ లోపే.. వంద శాతం పెన్షన్లు చెల్లించాలని నిర్ణయించారు. ఇదే విషయాన్ని కోర్టుకు చెప్పే అవకాశం ఉంది.
తెలంగాణలోనూ అక్కడి ప్రభుత్వం గత యాభై శాతం పెన్షన్లను తగ్గించి ఇచ్చింది. అయితే అక్కడ కూడా కోర్టులో కేసు నమోదయింది. ఈ నెల 75 శాతం పెన్షన్లు ఇవ్వాలని కేసీఆర్ నిర్ణయించారు. ఇలా తగ్గించడం ఏ చట్టం కింద సమర్థనీయమో చెప్పాలంటూ.. హైకోర్టు ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసి.. వాలుగు వారాలకు వాయిదా వేసింది. అంటే ఈ నెల తెలంగాణలో పెన్షనర్లకు 75శాతం మాత్రమే అందుతుంది ఏపీలో వంద శాతం పెన్షన్.. పెన్షనర్లకు అందుతుందన్నమాట. గత నెలలో కట్ చేసిన మొత్తం మళ్లీ ఎప్పుడిస్తారో ఏపీ సర్కార్ క్లారిటీ ఇవ్వలేదు. వైద్యులు, పోలీసులు, పారిశుద్ధ్య సిబ్బంది, సచివాలయ సిబ్బంది మినహా మిగతా అందరికీ జీతాలు గత నెలలోనూ సగం తగ్గాయి. ఈ నెలలోనూ సగం తగ్గాయి. అయితే ఏపీ సర్కార్ తర్వాత ఇస్తామని చెబుతోంది.