తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే పార్టీ దివ్యంగా వెలిగిపోతుందని… ఈ రాష్ట్రం మొత్తం తమ అమ్మ, పార్టీ పాదాల వద్ద శాశ్వతంగా పడి ఉంటుందని కలలుకన్నందుకు ప్రస్తుతం పశ్చాత్తాప పడుతున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు పాపం చాలా కన్ఫ్యూజన్లో ఉన్నట్లుగా కనిపిస్తోంది. ఒకవైపు మరికొన్ని గంటల వ్యవధిలో హైదరాబాదు నగర మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు కూడా జరగబోతూ ఉండగా, ఆ ఎన్నికలను తక్షణం వాయిదా వేసేయాలంటూ వారు ఎన్నికల సంఘాన్ని కోరడం.. ఎలాంటి ఆధారాలూ లేని ఆరోపణలతో చర్యలు తీసుకోవాలని ఆరాటపడడం అంతా కామెడీని సృష్టిస్తోంది. బుధవారం నాడు రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు ఎన్నికల సంఘాన్ని కలిసి గ్రేటర్ ఎన్నికల్లో ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందని, ఆ అక్రమాల మీద పూర్తిస్థాయిలో విచారణ జరిపించాలని ఆరోపణలు చేశారు. కేవలం తెరాసకు మెజారిటీ స్థానాలు దక్కడం మీద అనుమానంతోనే.. ఇలా దర్యాప్తు కోరడం విశేషం.
అయితే ట్విస్టు ఏమిటంటే.. దింపుడు కళ్లెం ఆశలు అన్నట్లుగా.. ఇప్పటికే 150 డివిజన్లు ఉండే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో.. కేవలం రెండు స్థానాలకు పడిపోయి.. దారుణమైన స్థితిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ చివరి ప్రయత్నం కింద ఇంకా మేయర్ ఎన్నికలను ఆపించాలని అనుకోవడం చిత్రంగా కనిపిస్తోంది.
గ్రేటర్ ఎన్నికలు పూర్తయిన నాటినుంచి కాంగ్రెస్ పార్టీ ఈవీఎం ల మీద పదేపదే ఆరోపణలు గుప్పిస్తూ ఉంది. అలాగే నారాయణఖేడ్‌లో కూడా ఈవీఎంల ద్వారా కూడా బ్యాలెట్ పేపరు లేదా, ప్రింటింగ్ సదుపాయం ఉన్న ఈవీఎంల ద్వారా మాత్రమే ఎన్నికలు నిర్వహించాలంటూ కాంగ్రెస్ పార్టీ పదేపదే కోరుతోంది. మరి ఎన్నికల సంఘం వీరి విజ్ఞప్తుల పట్ల స్పందిస్తుందో.. లేదా, ఈవీఎంలలో ట్యాంపరింగ్ సాధ్యం కాదంటూ.. వారి కోరికను తుంగలో తొక్కుతుందో అర్థం కావడం లేదు మరి!