తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి జాలిగొలిపే విధంగా తయారైపోయింది. పార్టీతరఫున గెలిచిన వాళ్లంతా తెరాసలోకి వెళ్లిపోతున్నారు. ఇంకా ఎందరు వెళ్తారో క్లారిటీ ఉండడం లేదు. మిగిలిన వాళ్లు.. గతిలేక, వెళ్లలేక మిగిలే వారు మాత్రమే అన్నట్లుగా పరిస్థితి తయారవుతోంది. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ కూడా పార్టీ నేతల మీద నిర్దిష్టంగా క్రమశిక్షణ చర్యలు కూడా తీసుకోలేని అచేతనమైన స్థితిలో కొట్టుమిట్టాడుతోంది. ఒకసారి తమ పార్టీనుంచి వెళ్లిపోయిన తర్వాత, సదరు నేతల మీద సస్పెన్షన్ వేటు వేస్తున్నట్లుగా పార్టీ ప్రకటిస్తోందే తప్ప.. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న సమయంలోనే క్రమశిక్షణ ఉల్లంఘించారంటూ వేటు వేసే స్థితిలో తెదేపా లేకపోవడం విశేషం.
ఉదాహరణకు ఆర్.కృష్ణయ్య విషయాన్నే తీసుకుంటే గనుక.. ఆయన వల్ల పార్టీకి ఎన్ని చికాకులు ఎదురవుతున్నప్పటికీ… ఆయన పార్టీ వ్యవహారాలను ఏమాత్రం పట్టించుకోకుండా ఉంటున్నప్పటికీ పార్టీ ఆయనను ఏమీ చేయలేకపోతోంది. గతంలో అయితే.. పార్టీ నిర్ణయానికి నాయకత్వానికి వ్యతిరేకంగా ఎవరైనా తలెగరేస్తే చాలు వారి మీద క్రమశిక్షణ చర్యలు తీసుకునే అలవాటు తెలుగుదేశం పార్టీలో ఉండేది. ఇప్పుడు అంత ధైర్యం పార్టీకి ఉన్నట్లు కనిపించడం లేదు. వివేక్, ఎర్రబెల్లి, ప్రకాశ్‌గౌడ్‌లు కూడా పార్టీని వీడి వెళ్లిపోయిన తర్వాత.. తమ రాజీనామా లేఖలను పార్టీకి పంపిన తర్వాత.. వారిని పార్టీనించి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. పార్టీలో భయానికి ఆత్మరక్షణ ధోరణులకు ఇది నిదర్శనంగా పలువురు భావిస్తున్నారు.
అదే సమయంలో.. పార్టీ ఎమ్మెల్యే శాసనసభలో ఉప నాయకుడు ఆర్.కృష్ణయ్య అసలు తెలుగుదేశంతో తనకు సంబంధంలేదంటూ వ్యాఖ్యలు చేస్తున్నప్పటికీ ఆయనను పార్టీ కనీసం మందలించే స్థితిలో కూడా లేదు. ఒకవైపు తెలుగుదేశం నాయకత్వాన్ని దుమ్మెత్తిపోస్తూ, కాపుల రిజర్వేషన్ విషయంలో చంద్రబాబు విధానాల్ని అడ్డుకుంటానని సవాళ్లు విసురుతూ… ఆయన పార్టీ పరువును, నాయకత్వాన్ని బజార్లోకి లాగుతున్నా పట్టించుకునే దమ్ము పార్టీకి ఉన్నట్లు లేదు. ఇలాంటి ఉపేక్ష ధోరణి పార్టీ బలం మీద ప్రజల్లోనూ అనుమానాలు కలిగించేలా తయారవుతోంది.
తెలంగాణలో పార్టీ తరఫున గెలిచిన 15 మందిలో 9 మంది తెరాసలో చేరిపోయారు. ఆర్.కృష్ణయ్య తనకు పార్టీతో సంబంధమే లేదని అంటున్నారు. కానీ టెక్నికల్‌గా తమ పార్టీ బలం తగ్గకుండా ఉండడం కోసం తెదేపా ఆయనను చూసీచూడనట్లు పోతున్నట్లుంది. ఇప్పుడు తెదేపా వాస్తవ బలం 5 అనుకుంటే.. మరో ఇద్దరు ముగ్గురు మారుతారని ఎర్రబెల్లి అంటున్నారు. అంటే ఫైనల్‌గా తెలుగుదేశం సభ్యులసంఖ్య ఎక్కడకు వచ్చి చేరుతుందోనని జనం జాలిగా చర్చించుకుంటున్నారు.