వైరస్ కట్టడిలో ప్రపంచంలోనే నెంబర్ వన్ సీఎం జగన్మోహన్ రెడ్డి. ఆయన ఫార్ములాను చూసి.. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా.. అబ్బురపడుతోంది. ఆయనతో భేటీ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఆయన ఫార్ములాను తెలుసుకుని ప్రపంచం అంతా అప్లై చేసేందుకు ఆరా తీస్తోంది. ఇది రోజువారీగా వైసీపీ నేతలు చేస్తున్న ప్రచారం. ట్విట్టర్ దగ్గర్నుంచి ప్రారంభించి మంత్రుల వరకూ ఈ స్తోత్రాన్ని వినిపిస్తున్నారు.
రోజుకు అరగంట సమీక్షనే నెంబర్ వన్ సీఎం ఫార్ములా..!?
నెంబర్ వన్ సీఎం ఫార్ములా.. వస్తుంది..పోతుంది.. అంతే. ఇప్పటికీ ఆయన అదే అభిప్రాయంతో ఉన్నారు. రోజూ పదకొండున్నరకు ఒక్క సారి సమీక్ష చేస్తారు. దాంతో ఆయన వ్యూహం అయిపోతుంది. తర్వాత ఇంగ్లిష్ మీడియం సహా.. అన్ని అంశాలపై సమీక్షలు పెట్టుకుంటారు. అధికారయంత్రానికి తీరిక లేకుండా చేస్తారు. అంతకు మించి ఆయన కరోనాపై దృష్టి పెట్టరు. అధికారులందరూ.. ఎవరు ఇష్టం వచ్చినట్లుగా వారు నిర్ణయాలు తీసుకుంటున్నారు. దాని ఫలితం… వైరస్ పై పోరాటంలో ఆంధ్ర ఎంత వెనుకబడిపోయిందో స్పష్టంగా కనిపిస్తోంది. దక్షిణాదిలో అత్యధిక వైరస్ మరణాలు ఉన్న రాష్ట్రంగా ఏపీ నిలిచింది. కేసులు వెయ్యి దాటిపోయాయి. జిల్లాలకు జిల్లాలు ప్రమాదకర వాతావరణంలో పడిపోయాయి. నిన్నటి వరకు కరోనాఫ్రీ జోన్ గా ఉన్న శ్రీకాకుళంలోనూ కేసులు నమోదవుతున్నాయి. ఇదంతా స్వయం కృతం. వస్తుంది… పోతుంది.. అని తెచ్చిపెట్టుకున్న నిర్లక్ష్యంతో వ్యవహరించిన దానికి ప్రతిఫలం. కానీ ప్రచారం మాత్రం.. ఆయన పనితీరుపై WHO సైతం అబ్బురపడుతోందని.
ఐసోలేషన్, క్వారంటైన్ పాటించడంలో నెంబర్ వన్..!
లాక్ డౌన్ ప్రారంభమైనప్పటి నుండి జగన్మోహన్ రెడ్డి ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టలేదు. అఫ్ కోర్స్ అంతకు ముందు కూడా ఆయన ఇంట్లోనే ఉన్నారనుకోండి. కానీ అప్పుడప్పుడూ సెక్రటేరియట్‌కి… వెళ్లేవారు. ఇప్పుడు అది కూడా లేదు. కంప్లీట్‌గా ఇంట్లోనే గడిపేస్తున్నారు. ప్రతీ రోజూ.. ఆయన టూర్ షెడ్యూల్.. ఇంట్లోని సమీక్షలు చేసే గదిలో ప్రారంభమై.. అక్కడే ముగుస్తుంది. మిగతా సమయం పర్సనల్. ఇంత పక్కాగా.. క్వారంటైన్ కానీ.. ఐసోలేషన్ కానీ అమలు చేసిన ముఖ్యమంత్రి భారతదేశంలో లేరని చెప్పుకోవచ్చు. దేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాలున్నాయి. కశ్మీర్‌లోని రెండు రాష్ట్రాలకు తప్ప అన్నింటికీ ముఖ్యమంత్రులున్నారు. అన్ని రాష్ట్రాల్లోనూ లాక్ డౌన్ అమలవుతోంది. అందరూ కరోనాపై పోరాడుతున్నారు. కానీ ఎవరూ ఇంట్లో ఉండటం లేదు. ఓ అరగంట సమీక్షలతో సరి పెట్టడం లేదు. అంతకు మించి చేస్తున్నారు. కర్ణాటక సీఎం యడ్యూరప్ప 80 ఏళ్లకు దగ్గర పడుతున్నారు. ఆయన క్షేత్ర స్థాయిలో పనులు చేస్తున్నారు. మమతా బెనర్జీ అసలు టూర్లలోనే ఉంటున్నారు. తమ తమ పరిధిలో విపరీతంగా కృషి చేస్తున్నారు. క్షేత్ర స్థాయికి వెళ్లి అధికారయంత్రాంగాన్ని ఉత్తేజితం చేస్తున్నారు. ప్రజలకు ధైర్యం చెబుతున్నారు.
చంద్రబాబు ఇంట్లో ఉన్నారంటూ రివర్స్ విమర్శలతో కాలక్షేపం..!
చంద్రబాబు ప్రతిపక్ష నేత. ఆయనను మామూలు రోజుల్లోనే బయట తిరగనివ్వలేదు. ఇప్పుడు వైరస్ సమయంలో తిరగనిస్తారన్న గ్యారటీలేదు. అయినా సరే ఆయన ప్రజల్లోకి రావట్లేదని.. ప్రజల్ని పట్టించుకోవడం లేదని విమర్శలు చేస్తున్నారు. అసలు ప్రజలు అధికారం కట్టబెట్టి… తిరుగులేని విధంగా 151 సీట్లు ఇస్తే.. జగన్ ఏమైనా బయటకు వస్తున్నారా..? బాధ్యత కలిగిన పాలకుడిగా మాత్రం ఆయన రోల్ మోడల్‌గా నిలవడం లేదు. ఆయన లాక్ డౌన్ పటిష్టంగా పాటిస్తున్నారని అనుకున్నా.. వైసీపీ నేతలందరికీ… ప్రత్యేకమైన పర్మిషన్ ఇచ్చేశారు. ఇష్టం వచ్చినట్లుగా వైసీపీ నేతలు.. ర్యాలీలు చేసి.. సాయం పేరుతో చేసిన రాజకీయం వల్ల మొత్తానికే మోసం వస్తోంది. కరోనాకు రాజకీయం తెలియదు. ఆ విషయం వైసీపీ నేతలు గుర్తించలేకపోతున్నారు.