సింహాచలం అప్పన్న చందనోత్సవ చరిత్రలో తొలి సారిగా ఓ మహిళ తొలి నిజరూప దర్శనం చేసుకున్నారు. సంప్రదాయబద్ధంగా…స్వామి వారి చందనోత్సవంలో పూసపాటి వంశీకుల్లో పురుషులు.. మొదటగా స్వామి వారి నిజరూప దర్శనం చేసుకుంటూ ఉంటారు. ఆ తర్వాతే… భక్తుల దర్శనాలు ప్రారంభమవుతాయి. ఏటా వైశాఖమాస శుక్లపక్ష తదియనాడు మాత్రమే సింహాచల వరాహలక్ష్మీనృసింహస్వామి నిజరూప దర్శనం భక్తులకు లభిస్తుంది. ఇందులో భాగంగా ఆదివారం తెల్లవారుజామున సుప్రభాత సేవతో స్వామిని మేల్కొలిపి సంప్రదాయం ప్రకారం ఆలయ వైదిక సిబ్బంది నోటికి వస్త్రాలను కట్టుకుని చందనోత్తరణం చేశారు.
అయితే.. ఈ సారి వైరస్ కారణంగా భక్తులెవరినీ అనుమతించే అవకాశం లేదు. అలాగే.. పూసపాటి వంశీయుల్ని కూడా.. ఆలయ అధికారులు ఆహ్వానించలేదు. మాన్సాస్ ట్రస్ట్‌కు ఇటీవలి కాలంలో చైర్మన్‌గా నియమితులైన సంచైత గజపతిరాజునే… పూసపాటి వంశీకుల తరపున అన్ని కార్యక్రమాలు నిర్వహించారు. సింహాచల అప్పన్న స్వామికి.. పూసపాటి వంశీయులు అనువంశిక ధర్మకర్తలు. ఆలయాన్ని పూసపాటి వంశీయులే నిర్మించారు. ఆలయానికి సంబందించిన వ్యవహారాలు.. దేవాదాయశాఖ చూసుకున్నా.. పూసపాటి వంశీకుల అధీనంలో ఉండే మాన్సాస్ ట్రస్ట్ పాత్ర కీలకం. ఆ ట్రస్ట్‌ను ఏర్పాటు చేసిన సమయంలో.. పూసపాటి వంశీయుల్లో వయసులో పెద్దవారైన మగ వ్యక్తి అధ్యక్షుడిగా ఉండాలని.. నిబంధన విధించారు. ఇప్పటి వరకూ మగవాళ్లే ఉంటూ వస్తున్నారు. ఈ కారణంగా చందనోత్సవం జరిగినప్పుడు.. నిజరూప దర్శనం మొదటగా… మగవ్యక్తి చేసుకునేవారు. ఇప్పుడు ప్రభుత్వం ఆ రూల్‌ని పట్టించుకోకండా… మహిళను చైర్మన్ గా నియమిస్తూ జీవో జారీ చేసింది. దీంతో… ఆమెకే నిజరూప దర్శన అవకాశం లభించింది.
చరిత్రలో ఎప్పుడూ కూడా ఇలా జరగలేదన్న విషయాన్ని మీడియా ప్రతినిధులు.. సంచైత వద్ద ప్రస్తావించినప్పుడు.. ఆమె లాజికల్‌గా స్పందించారు. చందనోత్సవం తర్వాత ఓ మహిళ స్వామి వారి నిజరూప దర్శనం చేసుకోవద్దని ఎక్కడైనా రాసి ఉందా అని ప్రశ్నించారు. అధికారులు ఎంతగానో సహకరిస్తున్నారని.. ఆలయంలో రానున్న రోజుల్లో మరిన్ని మార్పులు చోటు చేసుకుంటాని అమె అన్నారు. వైరస్ కారణంగా.. ఎలాంటి సేవలకు భక్తులకు అనుమతి ఇవ్వడంలేదు.