కరోనా ఎఫెక్ట్ ప్రింట్ మీడియాపై గట్టిగా కొట్టింది. ఉద్యోగాలు ఊడిపోతున్నాయి. జీతాల్లో కోత కనిపిస్తోంది. కొన్ని సంస్థలైతే జీతాలు ఇవ్వలేక చేతులు ఎత్తేశాయి. ఆంధ్రజ్యోతి ఉద్యోగుల జీతాల్లో 20 నుంచి 80 శాతం వరకూ కోత విధించారు. ఈనాడులో ఒకే రోజు 20 ఉద్యోగులు బలవంతపు రాజీనామాకు గురయ్యారు. `వెలుగు` పత్రిక ప్రస్థానమే ప్రమాదంలో పడింది. ఇప్పుడు ఇంగ్లీషు మీడియాకీ ఈ ఎఫెక్ట్ పడింది. గత రెండు నెలల నుంచీ డెక్కన్ క్రానికల్ ఉద్యోగులకు జీతాల్లేవు. ఎప్పుడుఇస్తారో తెలీదు. ఈ విషయమై ఉద్యోగులు యాజమాన్యాన్ని నిలదీసినా ప్రయోజనం లేకుండా పోయింది. ‘ఆదాయం తగ్గింది. జీతాలు ఇచ్చే పరిస్థితుల్లో సంస్థ లేదు.ఉంటే ఉండండి. లేదంటే లేదు’ అంటూ తెగేసి చెబుతున్నార్ట. కొంతకాలం డీసీ ప్రింటింగ్ ఆపేశారు. ఇప్పుడు ఏదోలా పునఃరుద్ధరించారు. ఆంధ్రప్రభలో అయితే గత మూడు నెలల నుంచీ జీతాల్లేవని సమాచారం. నమస్తే తెలంగాణ, సాక్షి పత్రికలు యధావిధిగా జీతాలు ఇచ్చినా.. ఉద్యోగుల్ని కుదించే పని ముమ్మరంగా సాగుతోందని సమాచారం. ఈ నెలాఖరున నమస్తే తెలంగాణ నుంచి కొంతమంది ఉద్యోగులు వెళ్లిపోనునన్నారని తెలుస్తోంది. డెక్కన్ క్రానికల్ నుంచి కూడా చాలామంది ఉద్యోగులు స్వచ్ఛందంగా తప్పుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.