చిన్నప్పటి సరదాలే వేరు. జామ తోట్లలో ఆడుకునే ఆటలు, మామిడి కాయల దొంగతనం, కాల్వ గట్లలో స్నానాలు.. ఎప్పటికీ తీపి జ్క్షాపకాలు. అయితే అప్పుడప్పుడూ ఆ అల్లరి శ్రుతిమించుతుంటుంది. నాన్నారి చేతిలో దెబ్బలు కూడా తినాల్సివస్తుంటుంది. శ్రీకాంత్ బాల్యంలోనూ ఇలాంటి మర్చిపోలేని సంఘటన ఒకటి జరిగింది.
శ్రీకాంత్ ఇప్పుడంటే కంప్లీట్ ఫ్యామిలీ మేన్ అయిపోయాడు గానీ, చిన్నప్పుడు ఒకటే అల్లరి. స్నేహితులతో కలిసి స్కూలు ఎగ్గొట్టి మరీ సినిమాలకు వెళ్లడం, పక్కింట్లోని జామకాయల్ని దొంగతనం చేయడం, కాల్వల్లో దగ్గర ఈత కొట్టడం… ఇలా అల్లరి ఓ రేంజులో సాగేది. పక్కింట్లో జామ కాయల దొంగతనం శ్రీకాంత్ బాల్యంలో నిరంతరం సాగే ప్రక్రియ. కాయలన్నీ మాయమైపోతున్నాయి గానీ, ఎవరు తెంచుకెళ్తున్నారో ఆ పక్కింటి వాళ్లకు అర్థమయ్యేది కాదు. ఓసారి ఆ దొంగ ఎవరో కనిపెడదామని కాపలా కాస్తే.. శ్రీకాంత్ దొరికిపోయాడు. `మీ అబ్బాయి మా ఇంట్లో దొంగతనం చేశాడు` అంటూ పక్కింటివాళ్లు శ్రీకాంత్ ఇంటిపైకి దాడి చేసినంత పని చేశారు. దాంతో.. శ్రీకాంత్ నాన్నకు చాలా కోపం వచ్చేసింది. ఆ రోజున శ్రీకాంత్ వీపు వాచేలా తన్నులు తిన్నాడు. నాన్న దెబ్బలకు భయపడిపోయి… శ్రీకాంత్ ఇంట్లోంచి పారిపోయాడు. రాత్రయినా శ్రీకాంత్ జాడ లేదు. శ్రీకాంత్ కోసం ఊరంతా గాలించారు. కానీ ఎక్కడా కనిపించలేదు. రాత్రికి శ్రీకాంత్ స్నేహితుడొకడు ఇంటికొచ్చి… ‘శ్రీకాంత్ కాల్వ గట్టు దగ్గర ఉన్నాడు. మీరు కొట్టనంటే ఇంటికొస్తాడట. కొడితే మాత్రం ఆ కాల్వలోనే దూకి చచ్చిపోతాడట’ అంటూ కబురు తీసుకొచ్చాడు. ‘వాడు ఎక్కడున్నా ఇంటికొస్తే చాలు. అస్సలు కొట్టం’ అని మాట ఇచ్చాకే.. శ్రీకాంత్ ఇంటికొచ్చాడట. అప్పటి నుంచీ శ్రీకాంత్‌పై ఒక్క దెబ్బ కూడా పడలేదు. కొడితే మళ్లీ ఎక్కడ పారిపోతాడో అన్న భయం వాళ్లది. అదీ.. శ్రీకాంత్ మర్చిపోలేని ఓ చిన్ననాటి సంగతి.