కరోనా అంటే జస్ట్ ఫ్లూనా..? కరోనా జస్ట్ నథింగ్ లైక్ జ్వరమా..? కరోనా అందరికీ వచ్చేస్తుందా..? కరోనా వచ్చింది .. పోయింది కూడా తెలియదా..? కరోనాతో కలిసి కాపురం చేయాల్సిందేనా..? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన రికార్డెడ్ సందేశం చూసిన తర్వాత ఎవరికైనా వచ్చే సందేహాలు ఇవి. ఓ వైపు కరోనా దెబ్బకు ప్రపంచం మొత్తం వణికిపోతోంది. రోజుకు కొన్ని వేల మంది చనిపోతున్నారు. కొన్ని లక్షల మందికి వైరస్ సోకుతోంది. ఆ వైరస్ ఎంత భయంకరమైనదో.. కళ్ల ముందే కనిపిస్తోంది. కరోనాకు మందు లేదని.. ప్రపంచం అంతా గగ్గోలు పెడుతోంది. అది సోకకుండా జాగ్రత్తలు తీసుకోవాలని లాక్డౌన్లు ప్రకటించేసి… ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయినా సరే.. ప్రాణాలే ముఖ్యమని.. తలుపులు వేసుకుని కూర్చుంటున్నారు. ఎవరూ.. కూడా… కరోనాను.. జస్ట్ జ్వరం అని తేలిగ్గా తీసి పారేసేంత ఆలోచన చేయలేదు. ఒక్కరు.. ఒకే ఒక్కరు.. జగన్మోహన రెడ్డి తప్ప.
మొదట్లో ట్రంప్, కేసీఆర్ కూడా అంతే..! కానీ తెలుసుకున్నారు కదా..!
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కరోనా వైరస్ కారణంగా స్థానిక ఎన్నికలను వాయిదా వేసినప్పుడు తొలి సారి ప్రెస్‌మీట్ పెట్టి…కరోనాను జ్వరంతో పోల్చారు. అప్పటికే.. ప్రపంచంలో కరోనా తీవ్ర ప్రభావం చూపిస్తోంది. అమెరికాలో ఉత్పాతం ప్రారంభమయింది. ఇటలీ, స్పెయిన్లలో మారణహోమం జరుగుతోంది. అంతకు ముందు.. ఆయా దేశాల నేతలు కూడా.. ఈ వైరస్‌ను పీపీలికం అనుకున్నారు. తమ దేశానికి వస్తే నలిపి పడేస్తాం అనుకున్నారు. ట్రంప్.. మొదట్లో కరోనాను .. జస్ట్ ఫ్లూ గా తేల్చారు. అందుకే.. ఆయన వైరస్ విస్తరణ పట్ల నాన్ సీరియస్‌గా ఉన్నారు. దాని ఫలితాలు ఇప్పుడు ప్రజలు అనుభవిస్తున్నారు అది వేరే విషయం. కరోనా వైరస్ ఇంత భయంకరంగా విస్తరిస్తుందని.. ప్రపంచంలోని ఏ దేశాధినేత కూడా అనుకోలేదు. అందరూ మొదట్లో లైట్ తీసుకున్నారు. అయితే.. ఫ్లూ లేకపోతే జ్వరం కేటగిరిలో వేసి.. పారాసిటమాల్ టైప్ మెడికేషన్ సరిపోతుందనుకున్నారు. అసెంబ్లీలో స్వయంగా కేసీఆర్ కూడా అంతే లైట్ తీసుకున్నారు. కానీ రాను రాను.. సీరియస్ నెస్ వారికి అర్థం అయిపోయింది. నిర్లక్ష్యం వహిస్తే… కరోనా సృష్టించే నష్టాన్ని మరో వందేళ్లయినా పూడ్చుకోలేమని అర్థం అయింది. అందుకే.. కరోనాను ఇప్పుడు బ్రహ్మరాక్షసితో పోల్చి యుద్దం చేస్తున్నారు. ఒకప్పుడు.. కరోనాను చాలా తేలిగ్గా తీసుకున్న కేసీఆర్.. ఇప్పుడు.. అంతకు మించిన ప్రమాదం లేదని రోజూ చెబుతున్నారు. దానికి తగ్గట్లుగా సీరియస్‌గా చర్యలు తీసుకుంటున్నారు. కానీ ఒక్క జగన్మోహన్ రెడ్డి మాత్రం.. కళ్ల ముందు కరోనా సృష్టిస్తున్న విలయాన్ని గుర్తించి… సీరియస్‌గా తీసుకోవడానికి నిరాకరిస్తున్నారు. తెలుసుకోవడానికి అంగీకరించడం లేదు.
తను నమ్మిందే నిజమనుకునే భావన ప్రమాదకరం..!
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తాను నమ్మినదే నిజం అనుకునే ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆయన అనుకుంటున్నది మాత్రమే నిజమని కళ్ల ముందు జరుగుతున్నది కూడా అబద్దమన్న ఓ రకమైన హలోకేషన్ పొజిషన్‌కి వెళ్లిపోవడం వల్లే ఇలాంటి సమస్యలు వస్తున్నాయంటున్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో ఏపీలో అత్యధిక మరణాలు చోటు చేసుకున్నాయి. అధికారిక లెక్కల ప్రకారం 31. కానీ అనధికారికంగా… గుర్తించని మరణాలు ఇంకా ఎక్కువే ఉంటాయన్న అభిప్రాయాలు గట్టిగానే వినిపిస్తున్నాయి. కరోనా వస్తే యువతకు ఏం కాదని.. సీఎం నమ్ముతున్నారు. ఒక సారి వచ్చి పోతే మళ్లీ రాదని కూడా అనుకుంటున్నారు. రేపో మాపో వ్యాక్సిన్ కనిపెట్టేస్తారని.. దాన్ని ఇంజక్షన్లా తీసేసుకుంటూ.. ఇక రాదని అనుకుంటున్నారు. అక్కడే సమస్య వస్తోంది. పైన చెప్పినవన్నీ… ఉట్టి వార్తలే. శాస్త్రవేత్తలు నిరూపించినవి కావు. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా అదే చెబుతోంది. కానీ కళ్లు తెరిచి ప్రపంచంలో ఏం జరుగుతుందో చూసి… తాను అనుకున్నదాని కన్నా భిన్నంగా జరుగుతోందని తెలుసుకోలేని పరిస్థితికి ముఖ్యమంత్రి వెళ్లిపోయారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
భరోసా ఇవ్వాలంటే జ్వరం లాంటిదేనని చెప్పడం కాదు..!
ముఖ్యమంత్రి భరోసా ఇవ్వాలనుకుంటున్నారని ..భయం కాదని అందుకే అలా చెబుతున్నారనే వాదనను కొంత మంది వినిపిస్తున్నారు. దాన్ని భరోసా ఇవ్వడం అనరు. కరోనాపై పోరాటంలో… ఆర్థికంగా..సామాజికంగా మాత్రమే కాదు.. నిరక్ష్యరాస్యతలో వెనుకబడిన దేశాలు కూడా.. అత్యంత జాగ్రత్తగా ఉంటున్నాయి. ఆయా దేశాల పాలకులు తమ ప్రజలకు ధైర్యం చెబుతున్నారు. కానీ అది నిర్లక్ష్య పద్దతిలో కాదు. అది జ్వరం మాత్రమే అని లైట్ తీసుకోమని చెప్పడంలేదు. ఉగాండా అధ్యక్షుడు తమ దేశ ప్రజలకు ఇచ్చిన ఓ సందేశం… ప్రపంచ ప్రజలకు ఇచ్చిన సందేశంలా మారింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కరోనా ఎంత మాత్రం తేలిగ్గా తీసుకునే వైరస్ కాదని.. చెబుతూ.. ఎంత జాగ్రత్తగా ఉండాలో.. యుద్ధంతో పోల్చుతూ.. ఆయన ఇచ్చిన సందేశం…. వైరల్ అయింది. నాయకుడంటే.. అలా ఉండాలని .. ప్రజలకు భరోసా ఇవ్వాలని అనుకుంటున్నారు. కానీ.. ఏపీలో ప్రజలను భయపెట్టకూడదంటూ.. సీఎం జగన్ చెబుతున్న మాటలు… బాధ్యతారాహిత్యానికి పరాకాష్టగా కనిపిస్తున్నాయి.
నేర్చుకునే సీఎం లేడు.. ప్రజలే అప్రమత్తంగా ఉండాలి..!
పాలకుడు తప్పులు చేయకుండా ఉండరు. దేనిపైనా ఓ తేలిక అభిప్రాయం ఏర్పర్చుకోకుండా ఉండరు. పాలకులు కూడా మనుషులే. కానీ.. తప్పుల నుంచి నేర్చుకునేవారే అసలైన పాలకులు. ఆ నేర్చుకున్నదాన్ని ప్రజల ప్రాణాలు కాపాడటానికి వినియోగించేవారే.. నిజమైన పాలకులు. ప్రపంచంలోని లీడర్లందరూ ఈగోలు వదిలి పెట్టి ప్రజల కోసం పరుగులు పెడుతున్నారు. కానీ ఒక్క ఏపీలో మాత్రం.. వైరస్‌తో సహజీవనం చేయాలని సలహాలిచ్చే పాలకులు ఉన్నారు. ఇక ప్రజలు చేయగలిగిందేమీ లేదు… వారిని వారు రక్షించుకోవడమే.