గల్ఫ్ దేశాలలో..అమెరికాలో అప్పుడప్పుడూ.. ఓ వ్యక్తి జాక్ పాట్ కొట్టాడని… అనుకోకుండా లాటరీ కొట్టాడని.. వార్తలు వస్తూంటాయి. అందులో కొన్ని నిజాలు.. కొన్ని అబద్దాలు. అలాంటి వార్తలు ఇక నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే.. లాటరీలను ప్రవేశ పెట్టాలని ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. మూడు దశాబ్దాల కిందట ప్రభుత్వాలు లాటరీలు నిర్వహించేవి. ఏపీ సర్కార్ కూడా నిర్వహించేది. కానీ లాటరీల వ్యసనానికి గురయి.. ప్రజలు చితికిపోతున్నారన్న విమర్శలు రావడంతో… ఆ వ్యాపారాన్ని ప్రభుత్వాలు నిలిపివేశాయి. ఇప్పటికీ కొన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వాలు లాటరీలు నిర్వహిస్తున్నాయి. ఈశాన్య రాష్ట్రాల్లో ఎక్కువగా ఈ లాటరీల వ్యాపారం నడుస్తోంది. ఏపీలో అయితే.. అక్కడి లాటరీ టిక్కెట్లు కూడా అమ్మడానికి లేదు. మొత్తంగా జూదాన్ని బ్యాన్ చేశారు.
ప్రస్తుతం వైరస్ కారణంగా ఆదాయం పూర్తిగా పడిపోయింది. ఈ ప్రభావం తర్వాత కాలంలోనూ కొనసాగనుంది. ఏటా 20 శాతం చొప్పున.. మద్యం దుకాణాలను తగ్గించలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. ఎలా చూసినా.. ప్రభుత్వ ఆదాయం తగ్గిపోతుది కానీ పెరిగే అవకాశం లేదని అంచనా వేస్తున్నారు. అదే సమయంలో చేస్తున్న అప్పులకు వడ్డీ చెల్లింపులు కూడా… పెరగనున్నాయి. అందుకే ఇప్పుడు ఏపీ సర్కార్ వినూత్నంగా ఆలోచిస్తోంది. ఆ లాటరీలను మళ్లీ ప్రవేశ పెడితే ఎలా ఉంటుందన్నదానిపై అధ్యయనం ప్రారంభించింది. ఏపీ సర్కార్.. సంక్షేమం కోసం… కొన్ని వేల కోట్లు ఖర్చు పెడుతోంది. దానికి తగ్గట్లుగా ఆదాయం వచ్చే పరిస్థితి లేదు. ఆదాయం పెంచుకోవాలంటే కొత్త కొత్త మార్గాలు ఆన్వేషించారు.
ఈ మేరకు కొత్త మార్గాల అన్వేషణ గురించి అధికారులకు… ప్రభుత్వం నుంచి సూచనలు అందాయి. కొంత మంది ఈ లాటరీల విషయాన్ని తెరపైకి తీసుకువచ్చారు. లాటరీల నిర్వహణ.. ప్రభుత్వానికి వచ్చే ఆదాయం తదితర అన్ని అంశాలపై ఓ నివేదిక తయారు చేసినట్లుగా తెలుస్తోంది. దీనిపై తదుపరి చర్చలు జరిపి… ముందుకెళ్లే అవకాశం ఉందంటున్నారు. అయితే.. ఆదాయం కోసం లాటరీలు ప్రవేశ పెట్టాలన్న ఆలోచన చేయడం కరెక్ట్ కాదనే వాదన సహజంగానే వినిపిస్తోంది. ఓ వ్యసనాన్ని మాన్పించడానికి మరో వ్యసనాన్ని అలవాటు చేయడం ఏమిటనే విమర్శలు వస్తాయి. అధికారులు దీనిపై నివేదిక ఇచ్చినా ప్రభుత్వం అంగీకరించదనే అనుకుంటున్నారు.