ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంక్షేమ పథకాలకు రూ. వేల కోట్లు విడుదల చేస్తోంది. కొత్త ఆర్థిక సంవత్సరంలో అప్పులు తీసుకునే వెసులుబాటు దొరికిన వెంటనే పెద్ద ఎత్తున అప్పులు చేస్తోంది. మార్కెట్ నుంచి ఒక్క నెలలోనే రూ. నాలుగువేల కోట్ల రుణాలు సేకరించింది. రిజర్వ్ బ్యాంక్ ఇచ్చిన వెసులుబాట్లతో మరో రూ. పది వేల కోట్ల వరకూ వాడుకునే అవకాశం లభించింది. వీటన్నింటినీ తమ మార్క్ సంక్షేమానికి ప్రభుత్వం వినియోగిస్తోంది. మొన్న రూ. 1400 కోట్లను… సున్నా వడ్డీ పథకం కింద.. డ్వాక్రా మహిళలకు ఇచ్చారు. ఇప్పుడు.. రూ. మరో నాలుగు వేల కోట్లను… కాలేజీలకు ఫీజు రీయింబర్స్ బకాయిలుగా చెల్లించబోతున్నారు. ఇలా వేల కోట్లు.. క్లిష్ట సమయాల్లో… సంక్షేమానికి కేటాయించడంపై ఎవరికీ అభ్యంతరాలు లేవు కానీ.. ఉద్యోగుల జీతాలను.. తగ్గించడమే ప్రశ్నించడానికి కారణం అవుతోంది.
ఉద్యోగుల జీతాలు అందరికీ తగ్గించలేదు. వైద్య, పోలీసు, పారిశుద్ధ్య, సచివాలయ ఉద్యోగులందరికీ పూర్తి జీతం చెల్లిస్తున్నారు. పెన్షన్లు మొత్తం చెల్లిస్తున్నారు. వార్డు, గ్రామ సచివాలయాలు, వాలంటీర్లందరికీ మొత్తం చెల్లిస్తున్నారు. అంటే.. కొన్ని రకాల శాఖల ఉద్యోగులకు మాత్రమేకోత పడుతోంది. ప్రతీ నెల ప్రభుత్వ జీతాల బిల్లు రూ. ఐదు వేల కోట్లు అవుతుందనుకుంటే… ఇలా పూర్తి జీతం చెల్లిస్తున్న వారికి.. మిగతా వారికి సగం కోత పెట్టడం వల్ల మిగుల్చుకుంటోంది.. రూ. వెయ్యి నుంచి రెండు వేల కోట్ల లోపే ఉంటుందని అంటున్నారు. ఈ కొంచెం మొత్తం తగ్గించుకోవడం వల్ల ప్రభుత్వం పెడుతున్న ఖర్చులో పెద్ద మొత్తంలో ఆదా అయ్యేది ఏమీ ఉండదు. కానీ జీతం మీద మాత్రమే ఆధారపడే ఉద్యోగుల కుటుంబాలకు మాత్రం ఆర్థిక ఇబ్బందులు వస్తున్నాయి.
ప్రభుత్వం అప్పో సొప్పో చేసి… కష్ట కాలంలో ప్రజలకు అండగా ఉంటున్నామనే పేరు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తోంది. ఈ విషయంలో కొంత మందిని కొట్టి.. మరికొంత మందికి పెట్టే ప్రయత్నమే… విమర్శల పాలవుతోంది. ఈ నెలలో సంక్షేమ పథకాలు.. ఇతర ఖర్చుల కోసం.. రూ. పది వేల కోట్లకుపైగా ఖర్చు చేసి ఉంటారు. ఇంత చేస్తున్నా.. ఉద్యోగుల్లో వ్యతిరేకత కనిపిస్తోంది. ఉద్యోగుల జీతాలు కత్తిరించి సంక్షేమం పేరుతో పంచితే వారికి ఆగ్రహంగానే ఉంటుంది. ఎందుకంటే.. ఇదే మొదటి నెల కాదు.. వరసుగా రెండో నెల. కేంద్ర ప్రభుత్వం తమ ఉద్యోగులకు ఎలాంటికోతలు విధించడం లేదు. ఇది కూడా.. ఏపీ ఉద్యోగుల్లో అసహనానికి కారణం అవుతోంది.