మొదటి నుంచి కరోనా వైరస్‌ను నిర్లక్ష్యం చేస్తున్న ఏపీ ప్రభుత్వం.. తీరా పీకల మీదకు వచ్చేసిన తర్వాత చేతులెత్తేసిందని… ప్రతిపక్ష నేత చంద్రబాబు విమర్శించారు. కరోనా బయటపడినప్పటి నుండి ప్రభుత్వం తీరును వివరిస్తూ.. ప్రజలకు జాగ్రత్తలు చెబుతూ ఓ బహిరంగలేఖను.. ఆయన విడుదల చేశారు. ప్రపంచం మొత్తం వైరస్ దెబ్బకు అతాలకుతలం అవుతున్నా… ప్రభుత్వం మొదటి నుంచి జ్వరం లాంటిదేనని..బ్లీచింగ్ చాలని.. పారసిటమాల్‌తో తగ్గిపోతుందని నిర్లక్ష్యం ప్రదర్శించిందని చంద్రబాబు లేఖలో గుర్తు చేశారు. చివరికి ఇప్పుడు కలసి జీవించాల్సి ఉంటుందని చెప్పడం ప్రారంభించారని విమర్శించారు.
ప్రతిపక్ష నేత లేఖలో ప్రజా సమస్యలన్నింటినీ ప్రస్తావించారు. వలస కార్మికులు, చేతి వృత్తుల వారి పరిస్థితి దుర్బరంగా ఉందన్నారు. ప్రభుత్వానికి ఎన్ని విజ్ఞప్తులు చేసినా పట్టడం లేదని విమర్శించారు. ఆరు గాలం శ్రమించి పంటపండించిన రైతులకు … ఎదురవుతున్న కష్టాలపై చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. వారిని ఆదుకునేందుకు ప్రభుత్వం తరపు నుంచి చిన్నపాటి ప్రయత్నం జరగకపోవడం బాధాకరమన్నారు. పండిన పంటల్లో పది శాతం కూడా.. ప్రభుత్వం కొనుగోలు చేయలేదన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే కరోనా పెరిగిందని చంద్రబాబు లేఖలో ఆరోపించారు. ఎంపీ కుటుంబంలో ఆరుగురికి.. రాజ్‌భవన్ సిబ్బందికి కరోనా సోకడం కంటే… ప్రభుత్వ నిర్లక్ష్యానికి మరో సాక్ష్యం అవసరం లేదన్నారు. అధికార పార్టీ నేతలు.. కరోనా స్ర్పైడర్లుగా మారి.. ప్రజల ప్రాణాలను రిస్క్‌లో పెట్టారని విమర్శించారు. కరోనా కిట్లలో అవినీతి.. వైద్య సిబ్బందికి సరైన ప్రొటెక్షన్ కిట్లు ఇవ్వకపోవడం వంటి వాటిని ప్రజల దృష్టికి తీసుకెళ్లారు.
జగన్మోహన్ రెడ్డి పరిపాలనా సామర్ధ్యం పైనా చంద్రబాబు విమర్శలు గుప్పించారు. సంక్షోభాలు వచ్చినప్పుడే.. నాయకత్వ లక్షణం బయటపడుతుందన్నారు. గతంలో తన హయాంలో సంక్షోభాలు వచ్చినప్పుడు ఎలా ఎదుర్కొన్నారో గుర్తు చేశారు. ఇప్పుడు జగన్ ఎంత నిర్లక్ష్యంగా ఉంటున్నారో కూడా వివరించారు. తెలుగుదేశం పార్టీ అత్యంత బాధ్యతాయుతంగా వ్యవహరిస్తోందని… ఎక్కడా లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించకుండా.. ప్రజలకు అండగా నిలబడుతోందన్నారు. ప్రజల సమస్యలపై ప్రతీ రోజూ.. ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తూనే ఉన్నామన్నారు. చివరిగా చంద్రబాబు.. ప్రభుత్వం పూర్తిగా చేతులెత్తేసిందని… మన ఊరు..మన వార్డు.. మన సమాజాన్ని మనమే కాపాడుకోవాలని పిలుపునిచ్చారు.