లాక్డౌన్ మినహాయింపులు, విధివిధానాలు అంటూ ఏపీ సర్కార్ కొద్ది రోజుల కిందట.. ఓ జాబితా విడుదల చేసింది. అందులో మెట్రో రైలు సర్వీసులు నడవవు అని ఘనంగా ప్రకటించుకుంది. దీన్ని చూసి.. ఇతర పార్టీల నేతలు సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు. ఒక వేళ పర్మిషన్ ఇచ్చినా నడవడానికి ఏపీలో మెట్రో రైళ్లు ఎక్కడ ఉన్నాయని ట్రోల్ చేశారు. ఇప్పుడు అదే మెట్రో రైళ్లకు సంబంధించి ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది. విజయవాడ, విశాఖల్లో నిర్మించతలపెట్టిన మెట్రో రైల్ ప్రాజెక్టుల కోసం… గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంస్థ పేరును మర్పు చేశారు. అమరావతి మెట్రో రైల్ కార్పొరేషన్ అనే పేరుతో గత ప్రభుత్వం ఓ సంస్థను ఏర్పాటు చేసి… విజయవాడ, విశాఖ మెట్రో ల కోసం ముందస్తు పనులు ప్రారంభించింది.
కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత అలాంటి పనులన్నీ రద్దు చేసింది. కొత్తగా .. ప్లాన్లు.. బిడ్లు ఆహ్వానించాలని నిర్ణయించింది. ప్లాన్లు కూడా మార్చింది. ఇలాంటి సమయంలో.. అమరావతి మెట్రోరైల్ కార్పొరేషన్ పేరును ఆంధ్రప్రదేశ్ మెట్రో రైల్ కార్పొరేషన్ గా మారుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి విజయవాడలో అయినా.. విశఆఖలో అయినా.. మెట్రోకు సంబంధించిన పనులన్నీ… ఆంధ్రప్రదేశ్ మెట్రో రైల్ కార్పొరేషన్ పేరు మీదనే నడుస్తాయి. ఇప్పుడు ఇంత హఠాత్తుగా.. అమరావతి పేరు తీసేసి.. ఆంధ్రప్రదేశ్ అనే పేరు ఎందుకు పెట్టాల్సి వచ్చిందన్నదానిపై ఎవరికీ క్లారిటీ లేదు.
కానీ అమరావతి విషయంలో.. ప్రభుత్వ పెద్దలకు ఉన్న వ్యతిరేకతను కారణంగా చెప్పుకోవచ్చని అంటున్నారు. ప్రస్తుతం మెట్రో ప్రాజెక్టుల పనులు… మూడు అడుగుల ముందుకు.. ఆరు కిలోమీటర్ల వెనక్కి అన్నట్లుగా ఉన్నాయి. గత ప్రభుత్వం ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ సాయంతో చేసిన కసరత్తును మొత్తం పక్కన పెట్టేయడంతో.. ఇప్పుడు మళ్లీ మొదటి నుంచి ప్రారంభించాల్సిన పరిస్థితి ఏర్పడింది.