తేజ ఓ మొండి ఘటం. తాను అనుకున్నదే చేస్తాడు. తనకు ఇష్టం వచ్చినట్టు ఉంటాడు. దేనికీ భయపడడు. తనకు కావల్సినట్టు నటించకపోతే… రెండు లెంపకాయలిచ్చి మరీ తన దారిలోకి తెచ్చుకుంటాడు. అలాంటి తేజ.. ఓ హీరోని చూసి భయపడ్డాడు. వణికిపోయాడు. ప్రాణ భయంతో.. పారిపోవాలని చూశాడు. అయితే దర్శకుడిగా ఉన్నప్పుడు కాదు. కెమెరామెన్‌గా పనిచేస్తున్నప్పుడు.
తేజ దర్శకుడు కాకముందు కెమెరామెన్. తెలుగులో కొన్ని సూపర్ హిట్ చిత్రాలకు పనిచేశాడు. కాకపోతే.. హిందీలోనే ఎక్కువ సినిమాలు చేశాడు. అక్కడ దాదాపు 30 చిత్రాలకు పనిచేశాడు. అమితాబ్ బచ్చన్, అమీర్ ఖాన్, సునీల్ శెట్టి.. ఇలా చాలామంది స్టార్ల సినిమాలకు కెమెరామెన్ గా బాధ్యతలు నిర్వర్తించాడు. జాకీష్రాఫ్‌తో ఓ సినిమా చేస్తున్నప్పుడు మాత్రం తొలిసారి ఓ వింత అనుభవం చవిచూశాడు.
`విశ్వవిధాత` షూటింగ్ జరుగుతోంది. ఓ ఇండోర్ సెట్ లో జాకీష్రాఫ్‌పై కీలకమైన షాట్ తెరకెక్కిస్తున్నారు. తేజ కెమెరామెన్. జాకీష్రాఫ్ నడుచుకుంటూ వచ్చి, ఓ చోట ఆగి డైలాగ్ చెప్పాలి. జాకీ ఎక్కడ ఆగాలో.. ఓ మార్క్ సెట్ చేసి పెట్టాడు తేజ. దానికి తగ్గట్టుగానే ఫోకస్, లైటింగ్ అమర్చుకున్నాడు. అయితే జాకీ ష్రాఫ్ మాత్రం ఆ మార్క్ దగ్గర ఆగలేకపోతున్నాడు. దానికి కాస్త ముందో, వెనక్కో, పక్కకో నిలబడి డైలాగ్ చెబుతున్నాడు. దాంతో లైటింగ్, ఫోకస్ రెండూ కుదరడం లేదు. తేజ జాకీకి చాలాసార్లు చెప్పి చూశాడు. కానీ.. జాకీ మాత్రం చేసిన తప్పే మళ్లీ మళ్లీ చేస్తున్నాడు. డైరెక్టర్‌కి విసుగొచ్చి `ఆయన ఎక్కడ వచ్చి నిలబడతాడో, అక్కడ ఫోకస్ చేసి షాట్ తీయొచ్చు కదా. హీరోని బడ్జి ఎడ్జిస్ట్ అయిపోవొచ్చు కదా` అని తేజకు సలహా ఇచ్చాడు. `అది నా తప్పు కాదు. నేను గీసిన చోటే తను నిలబడి.. డైలాగ్ చెప్పాలి` అని మెండికేశాడు. కానీ… జాకీ మాత్రం టేకుల మీద టేకులు తింటూనే ఉన్నాడు. చివరికి తేజకు విసుగొచ్చి.. జాకీ దగ్గరకు వెళ్లి.. `మీరు ఫోకస్ పెట్టడం లేదు. టేకుల మీద టేకులు తీసుకుంటున్నారు. ఇది యూనిట్ టైమ్‌ని వేస్ట్ చేయడమే` అంటూ తనకేం అనిపించిందో అది చెప్పేశాడు. జాకీ అప్పుడు మంచి స్వింగ్ లో ఉన్నాడు. పైగా ఓ స్టార్. అలాంటిది ఆయన్ని పట్టుకుని అన్ని మాటలు అనేసరికి యూనిట్ సభ్యులు మొత్తం నిర్ఘాంత పోయారు.
షాట్ అయ్యాక డైరెక్టర్ వచ్చి. ‘నువ్వు ఎవరితో పెట్టుకున్నావో తెలుసా? జాకీ లోకల్ గా పెద్ద దాదా. తనకి కోపం వస్తే మామూలుగా ఉండదు. ఎందుకైనా మంచిది. జాకీతో జాగ్రత్త’ అంటూ హైచ్చరించాడు. దాంతో తేజకు వణుకు మొదలైపోయింది. జాకీ ఏం చేస్తాడో అనే భయంతో ఆ రోజు షూటింగ్‌ని ఏదోలా పూర్తి చేశాడు. పేకప్ చెప్పగానే.. ఇక సెట్లో ఉండకూడదని, పరుగు పరుగున బయటకు వెళ్లిపోతుంటే.. జాకీ అనుచరుడు తేజని అడ్డుకున్నాడు. ‘షూటింగ్ అయిపోగానే సార్ మిమ్మల్ని కార్ వాన్ లోకి రమ్మన్నారు’ అని సీరియస్ గాచెప్పాడు. ‘ఈరోజు వద్దు.. రేపు వస్తా’ అని అక్కడి నుంచి జంప్ అవ్వాలని చూశాడు తేజ.కానీ అనుచరుడు ఒప్పుకోలేదు. ‘ఎట్టిపరిస్థితుల్లోనూ ఈరోజే కలవాలన్నారు’ అంటూ బలవంతంగా లాక్కెళ్లాడు. కార్ వాన్లోకి తేజ అడుగుపెట్టగానే.. బయటి నుంచి డోర్ కూడా వేసేశారు. దాంతో తేజ భయం మరింత పెరిగింది. జాకీ ఏమైనా చేస్తే.. గట్టిగా అరచి గోల పెట్టాలని తేజ డిసైడ్ అయ్యాడు. కానీ.. జాకీ మాత్రం కూల్‌గా తేజ దగ్గరకు వచ్చి ‘మీరు చెప్పింది కరెక్టే. నేను ఈ రోజు ఫోకస్ చేయలేకపోయా. నా వల్ల యూనిట్ టైమ్ అంతా వేస్ట్ అయ్యింది. ఇక నుంచి.. నా వల్ల ఈ పొరపాటు జరగదు.. సారీ’ అంటూ మర్యాదగా క్షమాపణలు అడిగాడట. దాంతో తేజ టెన్షన్ అంతా ఎగిరిపోయింది. ”బాలీవుడ్ హీరోలు కాబట్టి.. అలా పెద్ద మనసుతో నన్ను అర్థం చేసుకున్నారు. అదే సౌత్ లో ఏ హీరో దగ్గరా మనం ఇలా ప్రవర్తించలేం. అందుకే బాలీవుడ్ హీరోలంటే నాకు అంత గౌరవం” అంటూ ఈమధ్య ఓ ఇంటర్వ్యూలో ఫ్లాష్ బ్యాక్ ని గుర్తు చేసుకున్నాడు తేజ.