వైజయంతీ మూవీస్ త్వరలోనే 50 ఏళ్ల పండగ చేసుకోబోతోంది. ఈలోగా ఈ ప్రయాణంలోని మధుర స్మృతుల్ని నెమరువేసుకునే పనిలో పడింది వైజయంతీ మూవీస్. అడపా దడపా.. ఆనాటి విశేషాల్ని సోషల్ మీడియా ద్వారా సినీ అభిమానులతో పంచుకుంటామని ఈమధ్య ప్రకటించింది వైజయంతీ. ఇప్పుడు ఆ పరంపరలో మొదటి జ్ఞాపకం బయటకు వచ్చింది.
వైజయంతీ మూవీస్ పేరు వెనుక కథని చెబుతూ.. ఓ వీడియో బయటపెట్టారు. దగ్గుబాటి రానా వాయిస్ ఓవర్ ఇస్తూ రూపొందించిన ఈ వీడియో అప్పటి స్మృతుల్ని గుర్తు చేసింది. ఓ సీత కథతో… నిర్మాతగా అడుగుపెట్టారు అశ్వనీదత్. అయితే ఆయన కల ఎన్టీఆర్ తో సినిమా తీయడం. ఓ కొత్త నిర్మాతకు ఎన్టీఆర్ అపాయింట్ మెంట్ ఇవ్వడమే కష్టం.అలాంటిది సినిమా అంటే ఎలా ఒప్పుకుంటారు.కానీ అశ్వనీదత్ ఎన్టీఆర్ అపాయింట్మెంట్ సాధించారు. `మీతో సినిమా తీయాలనివుంది` అని ఎన్టీఆర్ ముందు తన కోరిక బయటపెట్టారు. `నాతోనే ఎందుకు తీయాలనుకుంటున్నారు` అని అడిగితే.. చక్కటి విశ్లేషణ ఇవ్వగలిగారు. దాంతో ఎన్టీఆర్ సంతృప్తి పడడం, కాల్షీట్లు ఇవ్వడం జరిగిపోయాయి. అప్పటికి అశ్వనీదత్ దగ్గర బ్యానర్ కూడా లేదు. `మన సంస్థ పేరేంటి బ్రదర్` అని అడిగిన ఎన్టీఆర్ కి ఇంకా నామకరణం కాలేదని తెలిసుకున్నారు. ఎదురుగా ఉన్న గోడకు శ్రీకృష్ణుడు పటం వేలాడుతూ కనిపించింది. శ్రీకృష్ణుడి మెడలో ఉన్న వైజయంతీ మాలని చూసిన ఎన్టీఆర్ `ఈ సంస్థ పేరు వైజయంతీ మూవీస్` అంటూ నామకరణం చేసేశారు. ఆ కథనే రానా తన గొంతులో అభిమానులకు చెప్పుకొచ్చారు. ఇదీ.. ఈ సంస్థ పేరు వెనుక కథ.
ఇక మీదట వైజయంతీ మూవీస్ తన ట్విట్టర్ ద్వారా కొన్ని మధుర జ్ఞాపకాలు పంచుకోబోతోంది. తమ సినిమాలకు సంబంధించిన ఆసక్తికరమైన ఫ్లాష్ బ్యాక్లను అభిమానులకు అందివ్వబోతోంది. ఈ లాక్డౌన్ సమయంలో.. ఇది మరో మంచి టైమ్ పాస్.
The story behind a 21 year old boy’s pursuit to make a movie… Here's our first story about the inception of @VyjayanthiFilms presented by @RanaDaggubati #VintageVyjayanthihttps://t.co/N3GINu9Xhy
— Vyjayanthi Movies (@VyjayanthiFilms) April 28, 2020