మార్చి 22వ తేదీన మొదలైన లాక్ డౌన్ కారణంగా అన్ని రంగాల ఉద్యోగులతో పాటు ఐటి ఉద్యోగులు కూడా ఇంటికే పరిమితమయ్యారు. అయితే వర్క్ ఫ్రం హోం చేస్తూ తమ ప్రాజెక్టులను కొనసాగిస్తున్న ఐటి ఉద్యోగులకు, వర్క్ ఫ్రం హోం జూలై 31 వరకు కొనసాగించే అవకాశం ఉందంటూ కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ అభిప్రాయపడ్డారు. వివరాల్లోకి వెళితే..
లాక్ డౌన్ కారణం గా అనేక రంగాల ఉత్పాదకత గణనీయంగా పడిపోయినప్పటికి ఐటి రంగంలో మాత్రం వర్క్ ఫ్రొం హోమ్ ( ఇంటి వద్ద నుండి పని చేసే) అవకాశం కారణంగా ఐటి ప్రాజెక్టుల డెడ్ లైన్లకు, ఐటీ ప్రాజెక్టుల డెలివరీ కి పెద్దగా ఇబ్బంది కలగలేదు. యూఎస్, కెనడా, యుకె వంటి దేశాలలో వర్క్ ఫ్రొం హోమ్ చేయడం సాధారణమే అయినప్పటికీ, భారతదేశంలోని పలు ఐటి కంపెనీలు ఉద్యోగులకు ఈ ఆప్షన్ ఇవ్వడానికి మొదట్లో పూర్తిస్థాయిలో మొగ్గు చూపలేదు. కానీ కరోనా వైరస్ కారణంగా తప్పనిసరి పరిస్థితుల్లో దాదాపు ఉద్యోగులందరికీ వర్క్ ఫ్రం హోం ఆప్షన్ ఇచ్చాయి భారతీయ ఐటి కంపెనీలు. అయితే లాక్ డౌన్ సమయంలోనూ వర్క్ ఫ్రొం హోమ్ కారణంగా , ఐటీ కంపెనీలు తమ ప్రాజెక్టులను యధావిధిగా కొనసాగించగలిగాయి. అటు కంపెనీలు ఇటు ఉద్యోగులు కూడా వర్క్ ఫ్రొం హోమ్ వల్ల ఇద్దరికీ బెనిఫిట్స్ ఉన్నట్టుగా గుర్తిస్తున్నారు.
ఈ నేపథ్యంలో, ఒకవేళ మిగతా రంగాలకు లాక్ డౌన్ సడలించినప్పటికీ, వేలాది మంది ఉద్యోగులు ఒకే చోట పని చేసే ఐటీ కంపెనీలు మాత్రం వర్క్ ఫ్రం హోం కొనసాగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్, రాష్ట్రాల ఐటీ శాఖల మంత్రుల తో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ, ఐటీ రంగంలో దాదాపు 85 శాతం పని ఇంటి నుండి పని చేసే ఉద్యోగుల తోనే జరిగిపోతుందని, కాబట్టి ఐటీ ఉద్యోగుల ఇంటి నుండి పని విధానాన్ని జూలై 31 వరకు కొనసాగించవచ్చని అభిప్రాయపడ్డారు.
ఈ మేరకు ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకొని త్వరలోనే అధికారికంగా ప్రకటించే అవకాశం కనిపిస్తుంది.