ఆంధ్రప్రదేశ్‌లో వైరస్ వీఐపీ సెంటర్లకు చేరుకుంటోంది. రాజ్‌భవన్‌లో నలుగురికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన విషయం కలకలం సృష్టిస్తూండగానే.. ఇప్పుడు… సచివాలయానికి వైరస్ సోకింది. వైద్య ఆరోగ్య మంత్రి పేషీలో అటెండర్‌గా పని చేస్తున్న వ్యక్తికి కరోనా పాజిటివ్‌గా తేలింది. దాంతో అతన్ని ఐసోలేషన్‌కు పంపారు. వెంటనే ఆరోగ్య మంత్రితో పాటు అటెండర్ సేవలు అందుకున్న పలువురికి ర్యాపిడ్ టెస్టులు చేసి…నెగెటివ్‌గా వచ్చిందని ప్రకటించారు. మహారాష్ట్ర మంత్రి పేషీలో ఒకరికి కొన్నాళ్ల క్రితం.. పాజిటివ్ గా తేలింది. అప్పుడే మంత్రికి టెస్టులు చేశారు. నెగెటివ్ గా వచ్చింది. మూడు వారాల తర్వాత మళ్లీ టెస్టులు చేస్తే.. ఆ మంత్రికి పాజిటివ్ వచ్చింది.
ఆంధ్రప్రదేశ్‌లో వైరస్ విస్తరణ ప్రమాదకరంగా ఉన్న తరుణంలో అధికారవర్గాలు.. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయన్న విమర్శలు వస్తున్నాయి. సహజంగాఎవరికైనా కరోనా పాజిటివ్ వస్తే అతనితో కాంటాక్ట్‌లో ఉన్న వారినందర్నీ… క్వారంటైన్‌కు తరలించాలి. కనీసం పధ్నాలుగు రోజుల పాటు ఉంచిన తర్వాత టెస్టులు చేసి.. నెగెటివ్ వస్తేనే.. బయటకు అనుమతించాలి. కానీ ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వచ్చిన వ్యక్తులతో కలిసి పని చేసిన వారు..యధేచ్చగా తిరుగుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. స్వయంగా మంత్రి అటెండర్ కు కరోనా పాజిటివ్ వస్తే .. ఆయనతో నేరుగా కాంటాక్ట్‌లో ఉన్న మంత్రితో పాటు మరికొందరిని క్వారంటైన్ కు పంపాల్సింది. కానీ పంపలేదు. అదే సమయంలో. .. గత వారం కోవిడ్ -19 కమాండ్ కంట్రోల్ సెంటర్ లో ఇద్దరికి పాజిటివ్ వచ్చింది. వారిద్దరితో కలిసి పని చేసిన వారిని క్వారంటైన్ కు పంపకుండా.. ఆఫీసును మాత్రం అక్కడ్నుంచి మార్చారు.
క్వారంటైన్ కు సామాన్యుల్ని పంపగలుగుతున్నారు కానీ.. పలుకుబడి ఉన్న వ్యక్తుల్ని పంపడానికి అధికారయంత్రాంగం సిద్దపడలేకపోతోంది. వైరస్‌కు అధికారం… ప్రతిపక్షం అనే తేడా ఉండదు. ఆ విషయాన్ని వారూ గుర్తించలేకపోతున్నారు. ఇన్ స్టంట్‌గా చేసే పరీక్షల్లో నెగెటివ్ వచ్చినా… 28 రోజుల్లో ఎప్పుడైనా బయటపడొచ్చని నిపుణులు చెబుతూనే ఉన్నారు. అయినా ప్రభుత్వ యంత్రాంగం.. నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తోంది.