అనకాపల్లి వైసీపీ ఎంపీ సత్యవతి రేషన్ బియ్యానికి కక్కుర్తి పడి పరువు పోగొట్టుకున్నారు. తన పుట్టిన రోజు సందర్భంగా భారీగా పేదలకు వితరణ చేయాలనుకున్నారు. సన్న బియ్యమో.. మరో బియ్యమో కొంటె డబ్బులు ఎక్కడ ఖర్చు అవుతాయనుకున్నారో ఏమో కానీ రేషన్ డీలర్ల సంఘంతో డీల్ చేసుకున్నారు. ఫలితంగా.. నేరుగా ఆమె కుటుంబానికి చెందిన కల్యాణమండపంలో లారీ బియ్యాన్ని అన్ లోడ్ చేసేందుకు తీసుకు వచ్చారు. ఆ లారీపై చౌకధరల బియ్యం రవాణా అని ఉంది… దానికి జీపీఎస్ కూడా ఉంది. అయినా.. అధికార పార్టీ ఎంపీ కాబట్టి… అలా బియ్యాన్ని “దిగుమతి” చేసుకోవడం చట్టబద్ధమేనని అనుకున్నారేమో కానీ… బహిరంగాగనే దింపుకోవడం ప్రారంభించారు. ఈ లోపు కొంత మంది చూసి.. ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వడం… ఆ లారీ డ్రైవర్‌ను.. డీలర్‌ను ప్రశ్నించడంతో.. విషయం పెద్దదయింది.
రేషన్ డీలర్లు ఎంపీగారి పుట్టిన రోజున పంచడానికి.. పేదలకు పంచాల్సిన ఆ బియ్యాన్ని తమ చందాగా ఇచ్చారన్న విషయం ఇప్పుడు గుప్పుమంటోంది. విషయం తెలిసిన విచారణ అధికారులు కేసు నమోదు చేశారు. రేషన్ డీలర్లపైనా…ఎంపీ భర్తపైనా కేసు నమోదు చేశారు. అయితే.. అధికార పార్టీ వ్యవహారం కాబట్టి.. ప్రజల ముందుకు వచ్చింది కాబట్టి…తూ..తూ మంత్రంగా కేసులు నమోదు చేస్తారు. ఈ కేసుల వల్ల వాళ్లకి ఇసుమంతైనా నష్టం ఉండదని ఎవరైనా సులువుగా ఊహించవచ్చని జనం అనుకుంటున్నారు. అసలు ఎంపీ సామాజిక సేవ చేయాలనుకుంటే.. పేదల బియ్యం … చందాగా తీసుకుని మళ్లీ పేదలకే పంచడం ఏమిటనే విమర్శలు సహజంగానే వస్తున్నాయి.
విషయం బయటపడింది కాబట్టి.. అనకాపల్లి ఎంపీ వ్యవహారం కక్కుర్తిగా చాలా మంది భావిస్తున్నారు. కానీ రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నేతలు పెద్ద ఎత్తున చేస్తున్న సహాయ కార్యక్రమాల్లో పంపిణీ చేస్తున్నది రేషన్ బియ్యమేనన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం కరోనా కారణంగా లబ్దిదారుల వేలిముద్రలు తీసుకోవడం లేదు. కానీ రెండు విడుతలుగా ఇచ్చిన రేషన్‌ని.. కార్డు దారులందరూ.. అంటే దాదాపుగా కోటిన్నరమంది తీసుకున్నారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. కనీసం 30 నుంచి 40 శాతం మంది బియ్యం తీసుకునే చాన్స్ లేదని అధికారవర్గాలు విశ్లేషిస్తూంటాయి. అక్కడే గోల్ మాల్ జరిగి ఉండవచ్చని ఆరోపణలు వస్తున్నాయి.