బాలీవుడ్ కి చెందిన విలక్షణ నటుడు ఇర్ఫాన్ ఖాన్ ఇవాళ మృతి చెందారు. 54 ఏళ్ల వయసున్న ఈ నటుడు కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్నారు. ముంబైలోని కోకిలాబెన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. వివరాల్లోకి వెళితే..
1966లో జన్మించిన బాలీవుడ్, హాలీవుడ్ లతో పాటు తెలుగు సినిమా సైనికుడు లో కూడా నటించారు. హాలీవుడ్ లో ఆయన నటించిన లైఫ్ ఆఫ్ పై, స్లమ్ డాగ్ మిలియనీర్ వంటి చిత్రాలు ఆస్కార్ బరిలో నిలిచాయి. బాలీవుడ్ చిత్రం లంచ్ బాక్స్ కూడా ఆయనకు మంచిపేరు తెచ్చింది. పలు పాత్రలకు ఆయన తన విలక్షణ నటన తో ప్రాణం పోసారు. 2011 లో పద్మశ్రీ పురస్కారాన్ని కూడా అందుకున్నారు. ఆయన గత కొంత కాలంగా కాన్సర్ తో బాధపడుతున్నారు. ఒక విలక్షణమైన క్యాన్సర్ తనకు సోకింది అని తెలిసిన తర్వాత కూడా విలక్షణమైన వ్యక్తులకు విలక్షణమైన వ్యాధులు వస్తాయి అని ట్వీట్ చేసారు. గత వారమే ఆయన తల్లి కూడా మరణించారు. లాక్ డౌన్ కారణంగా ఆవిడ అంత్యక్రియలను ఇర్ఫాన్ కేవలం వీడియో లో వీక్షించాల్సి వచ్చింది. ఇంతలోనే ఆయన తీవ్ర అనారోగ్యంతో నిన్న ఆస్పత్రిలో చేరారు.
ఇర్ఫాన్ ఖాన్ వంటి విలక్షణ నటుడిని కోల్పోవడం భారత సినీ పరిశ్రమకు తప్పకుండా పెద్ద లోటు.