వైరస్ రాజకీయ నేతల బలప్రదర్శనకు పెద్ద అడ్డంకిగా మారింది. ఇప్పుడల్లా.. అట్టహాసంగా కార్యక్రమాలు చేసుకోవడం సాధ్యం కాదని తేలిపోవడంతో.. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్.. సాదా సీదాగా బాధ్యతలు చేపట్టారు. నిజానికి ఆయనను నెలన్నర కిందటే.. బీజేపీ హైకమాండ్ తెలంగాణ బీజేపీ శాఖకు అధ్యక్షుడిగా ప్రకటించింది. మంచి రోజు చూసుకుని.. బలప్రదర్శన చేసి… ధూం..ధాంగా బాధ్యతలు చేపట్టాలని ఆయన అనుకున్నారు. అయితే.. ఈ లోపే వైరస్ ముంచుకొచ్చింది. లాక్డౌన్ ప్రకటించడం.. కరోనా వ్యాప్తి ఇప్పుడల్లా తగ్గేలా లేకపోవడంతో… బహిరంగ కార్యక్రమాలు… జనం గుమికూడే వ్యవహారాలు నిర్వహించడం ఇప్పుడల్లా సాధ్యం కాదని క్లారిటీ వచ్చేసింది.
అందుకే ధూం..ధాంగా పదవీ బాధ్యతలు చేపట్టాలనుకున్న నిర్ణయాన్ని వాయిదా వేసుకుని… సాదాసీదాగా బాధ్యతలు చేపట్టేశారు. శ్యాంప్రసాద్ ముఖర్జీ భవన్లో… బీజేపీ ఆఫీసుకు రాదగినంత దగ్గరలో ఉన్న వారి సమక్షంలో పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. బండి సంజయ్ ను అధ్యక్షుడిగా ప్రకటించిన తరవాత అప్పటి వరకూ అధ్యక్షుడిగా ఉన్న లక్ష్మణ్ సైలెంటయిపోయారు. రోజువారీ వ్యవహారాలకు సంతకం కూడా పెట్టే పరిస్థితి లేకపోవడంతో పలు పనులు ఆగిపోయాయి. దీంతో బండి సంజయ్ బాధ్యతలు చేపట్టాల్సిన పరిస్థితి కూడా ఏర్పడింది.
ఇప్పటికే బండి సంజయ్… అధికార పార్టీ మీద దూకుడుగా వ్యవహరిస్తున్నారు. టీఆర్ఎస్ పై ఘాటు విమర్శలు కురిపిస్తున్నారు. రైతులకు మద్దతుగా బీజేపీ కార్యాలయంలో దీక్ష కూడా చేశారు. ఆయనపై టీఆర్ఎస్ నేతలు ఘాటుగా విరుచుకుపడుతున్నారు. కరీంనగర్ నుంచి.. టీఆర్ఎస్ను ఓడించి… హిందూత్వ ఫేస్‌గా గుర్తింపు తెచ్చుకున్న బండి సంజయ్.. తెలంగాణలో పార్టీని … సరైన దారిలో తీసుకెళ్తారని.. సీనియర్లు కూడా నమ్ముతున్నారు.