సీనియర్ మోస్ట్ ఐఏఎస్ అఫీసర్ ఎల్వీ సుబ్రహ్మణ్యం రిటైర్మెంట్ ప్రక్రియ ఆన్లైన్లో జరిగిపోనుంది. ఈ మేరకు ప్రభుత్వం ఆయనకు అవకాశం కల్పించింది. సీఎస్‌గా పని చేస్తూ… ఆకస్మికంగా తొలగింపునకు గురైన ఆయనకు.. ప్రభుత్వం బాపట్లలోనే మానవ వనరుల శిక్షణా సంస్థ డైరెక్టర్ జనరల్ గా బదిలీ చేశారు. అక్కడ ఆయనకు కనీసం అటెండర్ కూడా లేకపోవడంతో.. విధుల్లో చేరలేదు. గత ఏడాది నవంబర్ నాలుగో తేదీన ఆయనను ట్రాన్స్ఫర్ చేస్తే.. ఇప్పటి వరకూ చార్జ్ తీసుకోలేదు. విధుల్లో చేరలేదు. ఐఏఎస్‌గా ఆయన సర్వీస్ ఈ నెలాఖరుతో అయిపోతుంది. అయితే.. రిటైర్మెంట్ ప్రక్రియ పూర్తి కావాలంటే.. ప్రస్తుతం చార్జ్ తీసుకోవాల్సి ఉంటుంది.
ఆయనకు.. మళ్లీ వచ్చి విధుల్లో చేరడం ఇష్టం లేదు. ఈ విషయంలో ఆయన పట్ల ప్రభుత్వ పెద్దలు సానుకూలంగా స్పందించారు. ఆయన ఆన్లైన్లో బాపట్ల హెచ్ఆర్డీ బాధ్యతలు తీసుకున్నట్లుగా నమోదు చేసుకోవచ్చని సూచించారు. దీంతో ఆయనకు గౌరవంగా రిటైరయ్యే అవకాశం దక్కింది. ఆరేడు నెలల పాటు సెలవులో ఉండి.. మళ్లీ విధుల్లో చేరకుండా రిటైర్మెంట్ అయితే… ఇబ్బందికర పరిస్థితులు వస్తాయి. ఈ ఇబ్బందికర పరిస్థితి నుంచి ఆయనను ప్రభుత్వం గట్టెక్కించిందని అనుకోవచ్చు. సిన్సియర్ ఆఫీసర్ గా పేరున్న సీనియర్ ఐఏఎస్ ఎల్వీ సుబ్రహ్మమ్యం కెరీర్.. విచిత్రంగా ముగుస్తోంది.
మొదట వైఎస్ హయాంలో కీలక బాధ్యతలు నిర్వర్తించారు. జగన్ అక్రమాస్తుల కేసులో ఇరుక్కున్నారు. తర్వాత టీడీపీ హయంలో కీలక శాఖలు నిర్వహించారు. ఎలక్షన్ కోడ్ సమయంలో.. సీఎస్‌గా చాన్స్ రావడంతో.. ఆయన వైసీపీకి అనుకూలంగా వ్యవహరించారనే విమర్శలు వచ్చాయి. తర్వాత జగన్ సీఎం అవగానే ఆయనను సీఎస్‌గా కొనసాగించారు. కానీ ఎక్కువ కాలం జగన్ అభిమానాన్ని నిలుపుకోలేకపోయారు. చివరికి సీఎస్‌గా పని చేసిన అధికారికి.. దక్కాల్సిన గౌరవం దక్కకుండా రిటైర్ అవుతున్నారు.