వైరస్ నివారణ చర్యల్ని పరిశీలించేందుకు ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర బృందాల్ని పంపాలని… కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. నాలుగు రోజుల్లో ఈ బృందం ఏపీకి రానుంది. నాలుగు రోజుల పాటు వైరస్ నివారణ కోసం తీసుకున్న చర్యల్ని పరిశీలించనుంది. నిజానికి కేంద్ర బృందాలను.. మెట్రో సిటీలకు మాత్రమే పంపారు. హైదరాబాద్, కోల్‌కతా, ముంబై లాంటి ప్రాంతాల్లో పెద్ద ఎత్తున వైరస్ వ్యాప్తి జరుగుతూండటంతో.. ఆయా ప్రాంతాల్లో లాక్ డౌన్ అమలు.. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ప్రత్యక్షంగా పరిశీలించేందుకు బృందాల్ని పంపారు. బెంగాల్ లాంటి చోట్ల కేంద్ర బృందాలకు… అక్కడి ప్రభుత్వాలు సహకరించకపోవడంతో… వివాదం ఏర్పడింది. మిగిలిన చోట్ల.. ఆయా ప్రభుత్వాలు… కేంద్ర బృందాలు తిరగడానికి ఏర్పాట్లు చేశాయి.
మెట్రో సిటీలు లేకపోయినప్పటికీ… ద్వితీయశ్రేణి నగరాల్లో కూడా.. పెద్ద ఎత్తున వైరస్ వ్యాప్తి చెందుతూండటంతో.. కేంద్రం.. కారణాలను పరిశీలించాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. కర్నూలు, గంటూరు, కృష్ణా జిల్లాలో వైరస్ సామాజిక వ్యాప్తి జరుగుతోందన్న అభిప్రాయాన్ని ఇప్పటికే అధికారవర్గాలు వ్యక్తం చేశాయి. ఈ దశకు వెళ్తే కట్టడి చేయడం కష్టం అవుతుంది. అదే సమయంలో… లాక్ డౌన్ అమలులో చాలా తప్పులు జరిగాయని కేంద్రానికి అనేక ఫిర్యాదులు వెళ్లాయి. కాళహస్తి ఎమ్మెల్యే ర్యాలీ.. పలువురు వైసీపీ ఎమ్మెల్యేలు సాయం పేరుతో భౌతిక దూరం పాటించకుండా చేసిన కార్యక్రమాలు జాతీయ మీడియాలోనూ హైలెట్ అయ్యాయి.
కరోనాపై పోరాటానికి కేంద్రమే… పూర్తి స్థాయిలో నిధులు ఇస్తోంది. ఈ నిధులు సద్వినియోగం అవుతున్నాయో లేదో కూడా పరిశీలించాలని కేంద్రం నిర్ణయించుకుంది. తెలంగాణలో నాలుగు రోజుల పాటు పర్యటించిన కేంద్ర బృందం.. ఆస్పత్రులు, క్వారంటైన్ సెంటర్లు , రెడ్ జోన్లు అన్నింటినీ పరిశీలించింది. ఉన్నతాధికారులతో సమీక్షలు నిర్వహించి వివరాలు తెలుసుకున్నారు. ఏపీలోనూ… క్వారంటైన్ సెంటర్లను పరిశీలించే అవకాశం ఉంది.