నిన్ననే విలక్షణ నటుడు ఇమ్రాన్ ఖాన్ని కోల్పోయి కంట తడి పెట్టింది చిత్రసీమ. ఆ బాధ నుంచి తేరుకోకముందే మరో విషాదం చుట్టుముట్టింది. ప్రముఖ బాలీవుడ్ నటుడు రిషి కపూర్ కన్నుమూశారు. ఆయన వయసు 67 ఏళ్లు. గత కొన్నాళ్లుగా ఆయన క్యాన్సర్‌తో బాధ పడుతున్నారు. తాజాగా శ్వాస కోస సంబంధిత సమస్యలు కూడా చుట్టిముట్టడంతో ఆయన్ని మళ్లీ ఆసుపత్రిలో చేర్చారు. ఈరోజు ఉదయం ఆయన పరిస్థితి విషమించింది. డాకర్టు ఎంత ప్రయత్నించినా లాభం లేకుండా పోయింది. గత యేడాది సెప్టెంబరులో అమెరికాలో కాన్సర్‌కి సంబంధించిన చికిత్స తీసుకున్నారు రిషి కపూర్. ఆ తరవాత ఆయన్ని అనారోగ్య సమస్యలు చుట్టుమడుతూనే ఉన్నాయి. ఏప్రిల్ నుంచి ఆయన పరిస్థితి మరింత క్షీణించింది.
1952 సెప్టెంబరు 4న ముంబైలో జన్మించారు రిషి కపూర్. తండ్రి రాజ్ కపూర్‌తో కలిసి తొలిసారి మేరా నామ్ జోకర్ (1970)లో నటించారు. అప్పటి నుంచి నటనే జీవితం అయ్యింది. బాబీ సినిమాతో బాలీవుడ్ దృష్టిని తనవైపుకు తిప్పుకున్నారు. మోస్ట్ రొమాంటిక్ హీరో ఇమేజ్‌ని సొంతం చేసుకున్నారు. రిషి కపూర్ నటించినవన్నీ దాదాపుగా ప్రేమకథలే. అవే ఆయనకు గుర్తింపు తీసుకొచ్చాయి. సర్గం, కూలీ, పతీ పత్నీ ఔర్ ఓ, హవాలత్, ఖజానా, సింధూర్, విజయ్, చాందినీ… ఇలా కపూర్ సినీ జీవితంలో ఎన్నో మంచి సినిమాలున్నాయి. ఈమధ్య కాలంలో ముల్క్, కపూర్ అండ్ సన్స్, 102 నాట్ అవుట్ చిత్రాల్లో నటించి మెప్పించారు. ఆ అబ్ లౌట్ చలే చిత్రంతో దర్శకుడిగానూ మారారు.