కరోనా వల్ల మీడియా రంగం మొత్తం సంక్షోభంలో పడింది. ముఖ్యంగా ప్రింట్ మీడియా. తెలుగునాట అగ్ర దిన పత్రికగా చలామణి అవుతున్న ఈనాడుకీ ఈ కరోనా బాధలు తప్పలేదు. ఇప్పటికే చాలామందిని ఉద్యోగాల్లోంచి తొలగించారు. ఇప్పుడు కూడా ఆ తొలగింపు నిరాటంకంగా సాగుతోంది. తాజాగా పేజీ డిజైనర్లని ఇంటికి పంపించేసే ప్రయత్నాల్లో ఉంది ఈనాడు. ఒకట్రెండు రోజుల్లో కనీసం 30 మంది పేజీ మేకర్లని తొలగించబోతోందని టాక్. అందుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఒకొక్కరికీ మూడు నెలల జీతం ముందస్తుగా చెల్లించి, రాజీనామా చేయించుకుంటున్నారు.
పేజీ మేకింగ్ ఆర్టిస్టులకు మంచి జీతాలిస్తోంది ఈనాడు. అయితే కరోనా ఎఫెక్ట్ వల్ల, జీతాల భారం తగ్గించుకోవాలని నిర్ణయించుకుంది. అందుకే సిటీ టాబ్లయిడ్స్ పేజీలను రూపొందిస్తున్న ఆర్టిస్టులను పక్కన పెట్టింది. కొంతకాలంగా జిల్లా ఎడిషన్లు రావడం లేదు. ఆ పేజీలకు పనిచేసే ఆర్టిస్టులంతా ఇళ్లకే పరిమితమయ్యారు. వాళ్లని ఈనాడు యాజమాన్యం శాశ్వతంగా తొలగించింది. డెస్క్‌లో ఉండి వార్తలు రాసే సబ్ ఎడిటర్లను పేజీ మేకింగ్ నేర్చుకోమని ఆదేశించింది. రాబోయే రోజుల్లో సబ్ ఎడిటర్లు అటు వార్తలు రాసి, ఇటు పేజీనీ డిజైన్చేయాలన్నమాట. అలా రెండు పనులూ నిర్వహించగలిగే వాళ్లకే ఉద్యోగాలు మిగులుతాయి. లేదంటే వాళ్లూ ఇంటికి వెళ్లాల్సిందే. ఈ కొత్త రూల్ తో ఈనాడు సబ్ ఎడిటర్లు గాభరా పడుతున్నారు. ఇప్పటికిప్పుడు మేక్ మేకింగ్ నేర్చుకోవడం, పేజీ పెట్టడం ఆషామాషీ వ్యవహారాలు కావు. కాకపోతే.. ఈనాడు జర్నలిజం స్కూల్ లో శిక్షణ ఇస్తున్నప్పుడే సబ్ ఎటిటింగ్ స్కిల్స్ తో పాటుగా, మేజీ ఎలా పెట్టాలో కూడా నేర్పిస్తారు. ఇప్పుడు ఆ శిక్షణ అక్కరకు రాబోతోంది.