తెలుగు ఎలక్ట్రానిక్ మీడియాలో మార్పులు వేగంగా జరుగుతున్నాయి. తెలుగు టీవీ చర్చా కార్యక్రమాలను దూకుడుగా నిర్వహించే పర్సనాల్టీల్లో ఒకరిగా పేరున్న వెంకటకృష్ణ… ఏబీఎన్ చానల్లో చేరారు. నిన్నామొన్నటి వరకు ఆయన AP 24/7 చానల్లో ఉన్నారు. అక్కడ అంతర్గత రాజకీయాలు ఎక్కువైపోవడంతో.. మెల్లగా బయటకు వచ్చేశారు. అలా వచ్చీ రాగానే.. ఆయనకు ఏబీఎన్‌లో అవకాశం లభించింది. ప్రస్తుతం టీవీ5లో ఉన్న మూర్తి గతంలో ఏబీఎన్‌లో ఉండేవారు. ఏబీఎన్ కు బ్రాండ్‌గా ఉండేవారు. అయితే యాజమాన్యంతో వచ్చిన విబేధాల వల్ల తర్వాత ఆయన మహా టీవీకి.. ఆ తర్వాత టీవీ 5కి వెళ్లిపోయారు. అప్పటి నుంచి.. టీవీ డిస్కషన్స్ కోసం ఓ ఇమేజ్ ఉన్న జర్నలిస్టు కొరత ఏబీఎన్ ను వెంటాడుతోంది.
ఆ కొరత ఇప్పుడు.. వెంకటకృష్ణ రూపంలో తీరే అవకాశం కనిపిస్తోంది. వరంగల్ జిల్లాకు చెందిన వెంకటకృష్ణ మొదట.. న్యూస్ కంట్రిబ్యూటర్‌గా జర్నలిస్టు జీవితాన్ని ప్రారంభించి అంచెలంచెలుగా ఎదిగారు. ఎలక్ట్రానిక్ మీడియాలో మొదటి అవకాశాల్ని అంది పుచ్చుకుని అనూహ్యంగా ఎదిగారు. అయితే.. ఎక్కడికి వెళ్లినా ఆయన అంతర్గత రాజకీయాల కారణంగానే ఆయా చానళ్ల నుంచి బయటకు వచ్చారు.
టీవీ5, హెచ్ఎంటీవీ, AP24/7 వంటి చానళ్లలో సుదీర్ఘంగా పని చేసినా… అంతర్గత రాజకీయాల కారణంగా అర్థంతరగా చానల్ నుంచి వైదొలగాల్సిన పరిస్థితి వచ్చింది. మిగతా చానళ్లతో పోలిస్తే.. ఏబీఎన్‌లో వర్కింగ్ స్టైల్ భిన్నంగా ఉంటుంది. ఎక్కువ మంది ఇన్చార్జులు ఉండరు .. మొత్తం యాజమాన్యం కనుసన్నల్లోనే వ్యవహారాలు నడుస్తాయి కాబట్టి.. వెంకటకృష్ణ ఎక్కువ కాలం ఏబీఎన్‌లో తన వాయిస్ వినిపించవచ్చని అనుకుంటున్నారు.