కేసీఆర్, కేటీఆర్ పై అవినీతి ఆరోపణలతో పొలిటికల్ ఎటాక్ చేయడంలో రేవంత్ రెడ్డి చాలా దూకుడుగా ఉంటారు. కరోనాపై పోరు.. లాక్ డౌన్ కారణంగా.. కొన్ని రోజులు సైలెంట్‌గా ఉన్న ఆయన.. హఠాత్తుగా.. కేటీఆర్, కేసీఆర్ భారీ స్కామ్‌కు పాల్పడ్డారంటూ.. మీడియా ముందుకు వచ్చేశారు. అయితే ఈ స్కాం.. కేంద్రం ఇచ్చిన నిధుల్ని వాడుకోవడమో… మరో దుర్వినియోగమో కాదు. కంపెనీలకు సంబధించినది. కేటీఆర్, కేసీఆర్‌ల సమీప బంధువుకు.. రూ. పది వేల కోట్ల విలువైన కాంట్రాక్ట్ ఒకటి వచ్చిందని రేవంత్ రెడ్డి చెబుతున్నారు. అది కేసీఆర్, కేటీఆర్ చలువుతోనే వచ్చిందని..బీజేపీ, టీఆర్ఎస్ వేర్వేరు కాదని అంటున్నారు.
అసలు రేవంత్ రెడ్డి చెబుతున్న స్కాం ఏమిటంటే.. కేటీఆర్, కేసీఆర్‌ల సమీప బంధువు పాకాల రాజేంద్రప్రసాద్ రాక్సెస్ లైఫ్ సైన్స్ అనే కంపెనీలో డైరక్టర్‌గా ఉన్నారు. ఈ కంపెనీకి దాదాపుగా రూ. పదివేల కోట్ల విలువైన హైడ్రాక్సీ క్లోరోక్విన్ టాబ్లెట్లను సరఫరా చేసే కాంట్రాక్ట్ కేంద్రం నుంచి దక్కింది. దీన్ని కేసీఆర్, కేటీఆరే ఇప్పించారని… రేవంత్ అంటున్నారు. పాకాల రాజేంద్ర ప్రసాద్ సైంటిస్ట్ కాదని.. ఆయన రాక్సెస్ లైఫ్ సైన్సెస్‌లో ఇటీవలే డైరక్టర్‌గా చేరారని రేవంత్ రెడ్డి చెబుతున్నారు. ఈయన ఈ సంస్థకు డైరెక్టర్ గా చేరిన కొద్దీ రోజులకే వందల కోట్లు వచ్చాయని రేవంత్ ఆరోపిస్తున్నారు. కరోనాను హైడ్రాక్సి క్లోరోక్విన్ అడ్డుకట్ట వేస్తుందని ప్రపంచం అంతా నమ్ముతోంది.ఈ కారణంగా డిమాండ్ విపరీతంగా పెరిగింది. ప్రపంచంలో తయారయ్యే హైడ్రాక్సీ క్లోరోక్విన్ టాబ్లెట్లలో 70శాతం ఇండియాలోనే తయారవుతాయి.
కేంద్రంతో సఖ్యతగా మెలుగుతూ.. మోడీని పొగుడుతూ.. కేసీఆర్ ఈ రకంగా బంధువులకు సాయం చేస్తున్నరాని అంటున్నారు. పాకాల రాజేంద్రప్రసాద్ డైరక్టర్‌గా ఉన్న సంస్థకు కేంద్రంతో ఒప్పందం కోసం కేసీఆర్-కేటీఆర్ మధ్యవర్తిత్వం వహించారని… ఆయన డైరెక్టర్ గా రాగానే 140 కోట్ల పెట్టుబడులు ఈ సంస్థకు పెట్టుబడులుగా వచ్చాయని రేవంత్ కొన్ని పత్రాలు చూపించారు. కొరొనా ప్రజలందరికీ సమస్యలు తెస్తే కేటీఆర్ కుటుంబానికి కనకవర్షం కురిపిస్తోందని మండిపడ్డారు. తన ఆరోపణలపై బీజేపీ కూడా సమాధానం చెప్పాల్సి ఉందున్నారు. ఇంతటి విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వ పెద్దలు వ్యాపారం చేసుకోవడంలో ఆంతర్యం ఏంటిని… ప్రశ్నిస్తున్నారు. ఈ విషయం పై ప్రధాని మోడీకి లేఖ రాస్తాను-పార్లమెంట్ లో ప్రశ్నిస్తానని స్పష్టం చేశారు.