తెలంగాణలో ఉన్న పేదలందరికీ.. కుటుంబానికి ఐదు వేలు ఇవ్వాలంటూ విపక్ష పార్టీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి. వైరస్ కారణంగా కొద్ది రోజులుగా రాజకీయ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్న తెలంగాణ విపక్షాలు ఇప్పుడు బాధితుల కోసం.. పేదల కోసం.. అండగా నిలబడతామంటూ… బయటకు వస్తున్నాయి. ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో విపక్ష పార్టీల నేతలు ఎల్.రమణ, చాడ వెంకటరెడ్డి, కోదండరాం .. తెలంగాణ చీఫ్ సెక్రటరీని సోమేష్ కుమార్ కలిశారు పేదల కోసం.. తమ డిమాండ్లను ఆయన ఆయన ముందు ఉంచారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియపైనా సూచనలు చేశారు.
కరోనా నివారణ చర్యల విషయంలో కేసీఆర్.. ప్రతిపక్షాలను అసలు పరిగణనలోకి తీసుకోవడం లేదని.. పార్టీలన్నీ కొద్ది రోజులుగా విమర్శలు చేస్తున్నాయి. కాంగ్రెస్ నేత వీహెచ్ ఇదే కారణంతో నిరాహారదీక్ష కూడా చేశారు. కేంద్రంలో నరేంద్రమోడీ అన్ని పార్టీల నేతల్ని పిలిచి మాట్లాడుతున్నారని.. కేరళలో అక్కడి ప్రభుత్వం ప్రతిపక్ష నేతలతో చర్చలు జరిపిన తర్వాతే నిర్ణయాలు తీసుకుంటున్నారని గుర్తు చేస్తున్నారు. తెలంగాణలో విపక్ష పార్టీల సలహాలను ఎందుకు తీసుకోరని ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలో.. విపక్ష పార్టీల నేతలందరికీ.. సీఎస్ సోమేష్ కుమార్ అపాయింట్మెంట్ ఇచ్చారు. వారు వెళ్లి ప్రభుత్వానికి తమ సూచనలు, సలహాలు .. విజ్ఞప్తులు చేశారు.
తెలంగాణ ప్రభుత్వం రేషన్ కార్డు ఉన్న వారందరికీ రూ. పదిహేను వందలు బ్యాంక్ అకౌంట్లో వేసింది. అయితే.. నెలన్నర రోజులుగా ఖాళీగా ఉంటున్న కూలీలు..ఇతర చేతి వృత్తుల వారికి అది సరిపోదని… రూ. ఐదు వేలు ఇవ్వాలనే డిమాండ్‌ను విపక్ష పార్టీలు చేస్తున్నాయి. ఏపీలో కూడా… అక్కడి ప్రతిపక్షం… కుటుంబానికి ఐదు వేలు ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది. రెండో సారి లాక్ డౌన్ పొడిగించిన తర్వాత ఆ మొత్తాన్ని పెంచారు. ఇప్పుడు విభిన్న వర్గాల వారీగా పది నుంచి ఇరవై వేల వరకూ ఆర్థిక సాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.